మన తెలుగులో ఒటీటీ కల్చర్ పెరిగిన తర్వాత చాలా మంది మలయాళం లేదా తమిళ సినిమాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. మలయాళం సినిమాల్లో కొత్తదనం ఉండటంతో ఆ సినిమాలకు అడిక్ట్ అవుతున్నారు. ఇక మలయాళం హీరోలకు మన దగ్గర ఫాన్స్ కూడా ఉంటున్నారు. ప్రేమం సినిమా తర్వాత మలయాళం సినిమాలకు క్రేజ్ పెరిగింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంచితే… మలయాళం సినిమాలకు ఎందుకు అడిక్ట్ అవుతున్నారో చూద్దాం.
సౌత్ లో తెలుగు, తమిళ సినిమాలు పూర్తిగా కమర్షియల్ హంగులతో ఉంటున్నాయనే మాట వాస్తవం. తమ వద్ద మంచి నటులు ఉన్నా సరే సినిమా వసూళ్ళ గురించి హింది లేదా ఇతర భాషల నటులను తీసుకొస్తున్నారు. ఇక షూటింగ్ కి కూడా విదేశాలకు ఎక్కువగా వెళ్ళడం, ఐటెం సాంగ్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. కాని మలయాళం సినిమాలో ఇటువంటి అంశాలు చాలా తక్కువ.
అక్కడ చేసే ఏ సినిమాను కూడా ఇతర భాషల్లో ప్రమోట్ చేయరు. హీరోయిన్ అయినా, హీరో అయినా, విలన్ అయినా సరే అక్కడి వాళ్ళే ఉంటారు. సినిమాల మీద ఆసక్తి ఉన్న వాళ్లకు అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మన దగ్గర ఆసక్తి ఉన్నా టాలెంట్ ఉన్నా సరే చిన్న పాత్రకు కూడా ఇతర భాషల మీద ఆధారపడటం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ మాతృక సినిమా అయ్యప్పన్ లో పరభాషా నటులు ఎవరూ లేరు.
కాని మన దగ్గర ఎందరో ఉన్నా సరే రానా తండ్రి పాత్రకు సముద్ర ఖనిని ఎంపిక చేసారు. ఇక అక్కడ షూటింగ్ స్పాట్ లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బీచ్ అయినా, హిల్ స్టేషన్ అయినా ఏదైనా సరే అక్కడి సినిమాలను అక్కడే షూట్ చేస్తారు. ఇక వాస్తవికతకు దగ్గరగా ఉండటమే కాకుండా కేరళ సంస్కృతి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అది లుంగీ అయినా చీర అయినా ఏదైనా సరే. ఇక స్థానికంగా సినిమాలు షూట్ చేయడం తో ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఎక్కువ.
మన దగ్గర వనరులు ఉన్నా సరే చిన్న సినిమాల్లో లవ్ సాంగ్ కోసం ఫారెన్ వెళ్తారు. ఇక అక్కడ బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మన దగ్గర బడ్జెట్ పేరుతో ఇతర భాషల నటులకు ప్రేక్షకుల సంపద దోచి పెడతారు. అద్భుతమైన సినిమాలు చేస్తూ కూడా పరభాషా నటుల మీద ఆధారపడటం అనేది నిజంగా దారుణమే. ఇతర భాషల్లో నటించే మన తెలుగు ఫేమస్ హీరోలు ఎవరూ ఉండరు. కాని పుష్ప విలన్ గా మలయాళ నటుడ్ని తీసుకున్నారు.