థాంక్యూ సినిమా మరీ తీసిపడేసే సినిమా కాదు. మంచి కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసే టీమ్ ఉంది. సినిమాలో విజువల్ ట్రీట్ ఉంది. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. బోర్ కొట్టకుండా 2 గంటల్లోనే ముగించేసే రన్ టైమ్ ఉంది. అన్నింటికీ మించి నాగచైతన్య, మాళవిక నాయర్ ల ఫైన్ పెర్ఫార్మెన్స్ ఉంది. అయినప్పటికీ ఈ సినిమాకు దారుణమైన రేటింగ్స్ ఇచ్చాయి కొన్ని సంస్థలు. 2/5, 2.25/5 లాంటి నంబర్స్ ఇస్తూనే, సమీక్షల్లో సినిమాను చీల్చి చెండాడారట.
ఈ సినిమాకు జస్ట్ కొన్ని వారాల ముందు, థాంక్యూ కంటే దారుణమైన మూవీస్ వచ్చాయి. వాటికి ఈ స్థాయిలో పోస్ట్ మార్టం జరగలేదు. ఇంత చెత్త నంబర్లు ఇవ్వలేదు. ఒక్క థాంక్యూ విషయంలో ఎందుకిలా జరిగింది? దీనికి సినిమా కంటెంట్ కంటే, తెరవెనక జరిగిన కథ వేరే ఉందని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. థాంక్యూ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన వెబ్ సైట్లకు యాడ్స్ ఇవ్వలేదు దిల్ రాజు. దీనికి కూడా ఓ కారణం ఉంది. సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు దిల్ రాజుపై దాదాపు అన్ని సైట్లు నెగెటివ్ కథనాలు ఇచ్చాయి. టికెట్ రేట్ల విషయంలో మాట తప్పాడని, సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు కాకుండా, 150 పెట్టాడని స్టోరీలు వచ్చాయి. అది నిజం కూడా.
ఈ కథనాలపై ఆగ్రహించిన దిల్ రాజు, తన సినిమా డిజిటల్ ప్రమోషన్ ఆపేశాడు. కొన్ని వెబ్ సైట్లకు యాడ్స్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన సైట్లు.. తమ కోపాన్ని సినిమాపై చూపించాయి. తక్కువ రేటింగ్స్ ఇచ్చి చీల్చిచెండాడాయి.
నిజానికి ఈ సినిమా ఇప్పుడు రావాల్సిన మూవీ కాదు. ఆడియన్స్ అభిరుచి మారిపోయింది. అలా అని ఇది చెత్త కంటెంట్ కూడా కాదు. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి. కేవలం నిర్మాతపై కోపంతో ఈ సినిమాను బలిచేశాయి కొన్ని వెబ్ సైట్లు. సమీక్షలు నిష్పక్షపాతంగా ఉండాలి. మేకర్స్ తో సంబంధం లేకుండా ఎలా ఉందో చెప్పాలి. అంతేతప్ప, ఇలా వ్యక్తిగత కారణాలతో సినిమా రివ్యూలు రాయడం మంచిది కాదు. అసలే థియేటర్లకు జనాలు రాని ఈ పరిస్థితుల్లో, ఇలాంటి కోపతాపాలు అస్సలు పనికిరావు.