ఇప్పుడు పంచె కడితే సాంప్రదాయాలను కాపాడినట్టు అనే భావనలో చాలా మంది ఉంటున్నారు. వివాహాలకు, సినిమాలకు, ఫంక్షన్ లకు ఇలా ప్రతీ ఒక్క విషయంలో కూడా పంచె ఫాషన్ గా భావిస్తున్నారు. అసలు ఈ పంచె సాంప్రదాయం గాని లేదంటే ఫాంట్ లు గాని ఎందుకు ధరించే వారు ఏంటీ అనే దానిపై చాలా మందికి అవగాహన లేదు. అసలు అది సాంప్రదాయమా…? లేక మరేదైనా కారణం ఉందా అనేది చూద్దాం.
పంచలు, ధోవతులు కట్ఠే పద్ధతి వందల ఏళ్ల క్రితమే మొదలైన విషయం. దాని వెనుక బలమైన కారణం ఉంది. పనిచేయడానికి, నడవడానికి, పరుగెట్టటానికి ఇవి వీలుగా ఉంటాయని అప్పట్లో పనుల్లో ఉన్న వారు కట్టేవారు. అయితే అప్పట్లో చొక్కాలు, లాల్చీలు ధరించేవారు కాదు. వాటి బదులుగా తువ్వాలు వేసుకునేవారు. క్రమంగా నేత బట్టతో జబ్బల బనీను ధరించడం మొదలయింది.
దీనికి గుండెల మీద లేదంటే కుడి వైపు కింద జేబులు ఉండేవి. ఇప్పటికీ గ్రామాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. మన దేశానికి ఇంగ్లీషు వాళ్ళ రాకతో ఫా౦టు, చొక్కా వచ్చాయి. అక్కడి నుంచి ఉద్యోగ, విద్య వ్యాపారాల్లో వీటిని ఎక్కువగా ధరించారు. దీనితో మన దుస్తుల తీరు క్రమంగా మారిపోయింది. వీటిని సంప్రదాయ వాదులు మొదట్లో వ్యతిరేకించినా తర్వాత శరీర సౌలభ్యం దృష్ట్యా, క్రమంగా అలవాటు పడ్డారు. పంచలు కట్టే తీరు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో సైతం కొన్ని వర్గాలు ఒక్కో తీరుగా ఉంటుంది. ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పంచెలు కనపడతాయి.