సినిమాల్లో హీరోయిన్‌ను హీరో ఏడిపించడం.. టీజింగ్ చేయడం.. నెమ్మదిగా లవ్‌లో పడేలా చేయడం.. అందుకు ఆమెను రకరకాలుగా వేధించడం.. వంటివన్నీ మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే వాస్తవానికి అవి సినిమాలు కనుక ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజ జీవితంలో ఎవరైనా చేస్తే.. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల కింద కేసు పెట్టి జైల్లో వేస్తారు. అది సహజం. కానీ నిజ జీవితం సంగతి పక్కన పెడితే.. సినిమాల్లో అయినా అలాంటి సన్నివేశాలలో మరీ అతి చేస్తే ? దాన్ని ప్రేక్షకులు ఏ మేర సహిస్తారు ? అంటే.. అందుకు కన్నడ సినిమాలోని కరాబు పాటే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు.
2021లో విడుదల కానున్న కన్నడ సినిమా పొగరులో కరాబు పేరిట ఒక పాట ఉంది. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అందులో ధ్రువ సర్జా, రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలోని కరాబు పాటను ఇటీవల విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభిస్తోంది. అయితే ఆ సాంగ్ ఎంత పాపులర్ అవుతుందో.. అది అంతే స్థాయిలో వివాదాస్పదం కూడా అవుతోంది. కారణం.. అందులో టీజింగ్‌ను మరీ పీక్ స్థాయిలో చూపించడమే.
పాటలో భాగంగా గ్యాంగ్ స్టర్ అయిన వ్యక్తి ఆ యువతితో ప్రేమలో పడతాడు. అందుకు ఆమెను ఒప్పించేందుకు ఆమె వెంట పడుతుంటాడు. అది కూడా తారా స్థాయిలో అన్నమాట. ఆమెను ముట్టుకుంటూ.. వేధిస్తూ.. టీజింగ్‌కు గురి చేస్తూ.. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో చూపించే స్థాయి కన్నా కాసింత ఎక్కువగానే ఆ పాటలో సన్నివేశాలను తీశారు. దీంతో ఆ సన్నివేశాలపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా అయినా, నిజ జీవితం అయినా.. అమ్మాయిలను అలా టీజ్ చేయడమేమిటి ? అదే పని బయట చేస్తే ఈవ్ టీజింగ్ కేసు పెట్టి లోపల పడేస్తారు, కానీ ఆ పాటలో మరీ అతిగా చేసి చూపించారు, అదే పరిస్థితి రేపు మన ఇంట్లో వాళ్లకు లేదా తెలిసిన వారికి, చుట్టు పక్కల ఎదురైతే బాధ్యత ఎవరిది ? ఆ పాటను చూసి అందరూ అలా చేయడం నేర్చుకోవాలా ? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాను సినిమాలా చూడాలని, లైట్ తీసుకోవాలని, దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని అంటున్నారు. అయితే దీనిపై ముందు ముందు ఏం జరుగుతున్నంది ఆసక్తికరంగా మారింది.