ఎప్పుడూ లేనిది ఉక్రెయిన్ లో అయోడిన్ పిల్స్ కోసం అక్కడి ప్రజలు ఎగబడుతున్నారు. రాజధాని కీవ్ నగరంలోని మందుల షాపుల వద్ద రోజూ వందలాది మంది క్యూలు కడుతున్నారు. ఇందుకు కారణం అణుదాడి జరిగిన పక్షంలో వీటి నుంచి రక్షణ లభిస్తుందన్న అభిప్రాయమే. పొటాషియం అయోడైడ్ లేదా కెఐ గా వ్యవహరిస్తున్న ఈ టాబ్లెట్లు ఓ రకమైన అణు ప్రభావాన్ని ఎదుర్కోగలవట . గొంతులోని గ్రంథులకు థైరాయిడ్ సోకకుండా నివారించగలవట.
అణుయుద్ధం జరిగిన పక్షంలో రేడియో అణుధార్మిక ప్రభావం వ్యాప్తి చెందుతుంది. ఇది హాని కలిగించకుండా అయోడిన్ పిల్స్ రక్షిస్తాయని అంటున్నారు. థైరాయిడ్ క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఇవి పనికొస్తాయని అంటున్నారు. రేడియో యాక్టివ్ గాలులు వాతావరణంలో ప్రవేశిస్తే మనుషులు శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుందని, ఆహారం కలుషితమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల హెల్త్ రిస్క్ లో పడుతుందంటున్నారు. దీని దుష్ప్రభావం ఎన్నో ఏళ్లపాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఈ పిల్స్ చౌకయినవని, ప్రపంచ వ్యాప్తంగా అమ్ముతున్నారని తెలిపింది. అమెరికా వంటి దేశాలు అప్పుడే ఈ పిల్స్ ని స్టాక్ చేసుకోవడం ప్రారంభించాయి. అసలే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా అణు బూచిని చూపుతోంది. అణ్వస్త్ర దాడికి తాము సిద్ధమని పుతిన్ ఇదివరకే హెచ్చరించారు.
అణు బాంబు ను పేల్చిన పక్షంలో అది అనేక రకాల రేడియేషన్ ని వెదజల్లుతుంది .రేడియో యాక్టివ్ తో కూడిన గాలులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని రకాల న్యూక్లియర్ ప్రభావాల నుంచి కాపాడుకోవటానికి పొటాషియం అయోడైడ్ బాగా పని చేస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కేవలం రష్యా హెచ్చరికే కాదు. ఉక్రేయిన్ లోని జాపోర్ఝజియా లో గల అణువిద్యుత్ ప్లాంట్ లో ఇటీవల విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అవాంతరాలు కూడా ఒక విధమైన ముప్పును కలగజేస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. రష్యన్ దళాలు ఈ ప్లాంట్ ని ఆక్రమించుకున్నాయి. యూరప్ లోని కొన్ని దేశాలు అయోడిన్ పిల్స్ ని పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడం ప్రారంభించాయి. తమ దేశంలోని ప్రతి కుటుంబం కనీసం ఒక్క సింగిల్ డోస్ అయోడిన్ నైనా రెడీగా ఉంచుకోవాలని ఫిన్లాండ్ ప్రభుత్వం ఆదేశించింది.