ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీపై నిషేధానికి సంబంధించిన ఫైల్స్ కాపీలు కావాలని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే కోరారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఆయన దరఖాస్తు చేశారు.
‘ది కేరళ స్టోరీ’ లాంటి వివాదాస్పద చిత్రాన్నే మోడీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నప్పుడు, బీబీసీ డాక్యుమెంటరీని ప్రజలు చూస్తే కేంద్రం ఎందుకంత అభద్రతకు గురవుతోందని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందేన్న కారణాలపై బెంగాల్ లో ‘ది కేరళ స్టోరీ’పై నిషేధం విధించామన్నారు.
అప్పుడు బీజేపీ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. కానీ జనవరిలో బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ను అత్యవసర చట్టాలు, అధికారాలను అమలు చేసి దాన్ని కేంద్రం నిషేధించిందన్నారు. మంత్రులతో కలిసి ప్రధాని మోడీ ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు.
కానీ బీబీసీ డాక్యుమెంటరీని చూసే వ్యక్తుల గురించి మోడీ చాలా అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. మరి ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ బీజేపీ భావ ప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటే బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు ప్రజలను ఎందుకు అనుమతించదని నిలదీశారు. ఎందుకీ కుట్రలు అని ప్రశ్నించారు.