హిందు-ముస్లింల సంఘర్షణకు నాగరిక, సాంస్కృతిక పరిష్కారం కనుగోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తరుచూ ముస్లిం మత పెద్దలు, మేధావులతో ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలు సమావేశం అవుతున్నారు.
ఇరు వర్గాల మధ్య ఏర్పడుతున్న సమస్యలపై చర్చించి వివాదాలను తగ్గించేందుకు ఈ సమావేశాల ద్వారా వెతుకుతున్నట్టు ఆర్ఎస్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ నెల మొదట్లో ఢిల్లీలో, గతేడాది అగస్టులో రెండు సార్లు ముస్లిం మేధావులతో సమావేశం అయ్యారు. అయితే సమావేశాలు దీర్ఘ కాలికంగా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడని స్వల్పకాలిక పరిష్కారాలు మాత్రమేనని అన్నారు.
తదుపరి సమావేశం ఏప్రిల్‌లో ఢిల్లీలో ఉంటుందని ఆర్ఎస్ఎస్ నేత ఒకరు చెప్పారు. సంఘ్ ప్రారంభించిన మొట్టమొదటి ముస్లిం ఔట్రీచ్ కార్యక్రమం ఇదేనని ఆయన అన్నారు. తాము ఎలాంటి ఎన్నికల లాభాలు లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సమావేశాలను నిర్వహించడం లేదన్నారు.
తాము ఓ నిర్దిష్టమైన ముస్లిం గ్రూపులతో సమావేశాలు నిర్వహించాలని అనుకోవడం లేదన్నారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ తాము ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. దశాబ్దాలుగా మత ఘర్షణకు సామాజిక నాగరికత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ చర్చలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు నలుగురు సీనియర్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, రామ్ లాల్, మన్మోహన్ వైద్య, ఇంద్రేష్ కుమార్ లను ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భాగవత్ నియమించారు. మరోవైపు ముస్లి మేధావుల నుంచి మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురైషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సీనియర్ జర్నలిస్టు షాహిద్ సిద్ధిఖీలను ఈ చర్చల్లో ప్రముఖ పాత్ర పోషించనున్నారు.
వివిధ అంశాలపై చర్చిస్తున్న సమయంలో ముస్లిం వర్గాల మేధావులు పలు అంశాలను ప్రధానంగా ఎత్తి చూపినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల దూకుడు స్వభావం, హిందూ రాష్ట్ర ప్రస్తావన, కాశీ, మథురకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించినట్టు సమాచారం.
ముస్లిం మేధావుల సమూహం మాత్రమే సమావేశాలకు ఉత్సాహం చూపిస్తోందని ఆర్ఎస్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ తాము మాత్రం ముస్లింలలోని అన్ని గ్రూపులతో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. అందుకే అన్ని గ్రూపులతో సమావేశాలకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.