రాజస్తాన్ లో పుల్వామా అమరవీరుల భార్యలకు మళ్ళీ అవమానం ఎదురైంది. తమ డిమాండ్లను సీఎం అశోక్ గెహ్లాట్ తిరస్కరించి… అవి తీర్చడం సాధ్యం కాదని ప్రకటించడంతో .. వారు జైపూర్ లో మాజీ డిప్యూటీసీఎం సచిన్ పైలట్ నివాసానికి చేరుకున్నారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురిని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. తమ కుటుంబ బంధువులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో సహా మరి కొన్ని డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు.
కొన్ని నిబంధనలను సవరించాలని కూడా వారు కోరుతున్నారు. అయితే వీరి పిల్లలకు బదులు వీరి బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న కోర్కె సహేతుకం కాదని, నిబంధనలను సవరించజాలమని సీఎం గెహ్లాట్.. అంటున్నారు. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ వితంతువుల్లో ఒకరు తన మరదికి జాబ్ ఇవ్వాలని కోరుతోందని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మరి ఆమె పిల్లల హక్కులు ఏమవుతాయన్నారు.
తమ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర బీజేపీ ఈ మహిళలను వినియోగించుకుంటోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి వీరు లిఖితపూర్వక హామీని కోరుతున్నారని ఆయన తెలిపారు. 2019 లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పలువురు జవాన్లు హతులయ్యారు. వితంతువులైన వారి భార్యలు ఇప్పుడు ఇలా డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
పైలట్ ఇంటివద్ద వీరితో బాటు నిరసన చేస్తున్న బీజేపీ ఎంపీ కిరోరి లాల్ మీనా.. తమ ఆందోళనను కొనసాగిస్తామని, వట్టి చేతులతో వెళ్ళేది లేదని హెచ్చరించారు.