తనకు ఎయిడ్స్ వ్యాధి ఉందనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్న భర్తపై భార్య పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. థానే జిల్లా డోంబివిలీ కి చెందిన 31 ఏళ్ల యువకుడికి, నవీ ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతికి 2016 లో పెళ్లయ్యింది. అతను బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తుంటాడు. వాళ్ల కుటుంబసభ్యులకు ముందే పరిచయం ఉండడంతో ఈ పెళ్లి కుదిరింది. అయితే అతనికి అప్పటికే ఎయిడ్స్ వ్యాధి ఉందనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. అబ్బాయి తరపు బంధువులు ఇంటికొచ్చినప్పుడల్లా రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకుంటున్నాడా అని ఆమెను అడిగే వారు. దీంతో అనుమానం వచ్చిన భార్య… భర్తను, ఆమె తల్లిదండ్రులను ఈ విషయమై అడగ్గా సమాధానం దాటవేసేవారు. భర్త తరచుగా అనారోగ్యానికి గురవుతుండడాన్ని ప్రశ్నించగా టీబీ ఉందని చెప్పాడు. చివరకు అసలు విషయం తెలుసుకున్న యువతి తాను పరీక్షలు చేయించుకోగా…ఆమెకు కూడా ఎయిడ్స్ వ్యాధి సోకింది. దీంతో షాక్ తిన్న భార్య తనను మోసగించి పెళ్లి చేసుకున్నట్టు కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కమోతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు ఆమె తల్లి దండ్రుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొంది.