భర్తను చంపేసి సినిమా చూపించాలనుకుంది. కానీ అది రిల్.. ఇది రియల్… అందుకే వారం రోజులకే నిజాన్ని బయటపెట్టేసింది ఓ భార్యమణి. ఇంతకీ ఏం జరిగిందంటే…
హీరో వెంకటేశ్ నటించిన “దృశ్యం” సినిమాను తలపించేలా జరిగిన.. ఓ రియల్ క్రైం కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సినిమాలో..హీరో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు వారు చేసిన హత్యను ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడటానికి ఓ నిర్మాణంలో ఉన్న పోలీసు స్టేషన్ కింద ఆ మృతదేహన్ని పూడ్చి పెడతాడు. సినిమా కాబట్టి హీరో ఎప్పటికీ దొరకడు. కానీ నిజ జీవితంలో మాత్రం నిందితురాలు కేవలం వారం రోజుల్లోనే దొరికి పోయింది.
తన అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. తాను పనిచేసే ఇంట్లోనే పూడ్చింది భార్య! కానీ.. ఇది సినిమా కాదు కదా! అందుకే.. ఎక్కువ రోజులు నిజాన్ని దాచలేకపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం తెలంగాణ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా బొందపల్లికి చెందిన రమేశ్(27) అతని భార్య వెన్నెల(25)తో కలిసి భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా.. భవన నిర్మాణ పనులకు వెళ్తున్న క్రమంలోనే రమేశ్ భార్య వెన్నెలకు వికారాబాద్ జిల్లాకు చెందిన దస్తప్పతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేత సంబంధానికి దారి తీసింది. జూన్ 30న వాళ్లిద్దరిని రమేశ్ చూడటంతో చాలా కాలంగా సాగుతున్న వీళ్ల వ్యవహారం బయటపడింది.
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. తన సంబంధం గురించి బయటపడకుండా ఉండాలంటే రమేశ్‌ను అడ్డుతొలగించుకోవటమే ఏకైక మార్గమని వెన్నెల భావించింది. ఇంకేముంది.. తర్వాతి రోజే ప్రియుడు దస్తప్పతో కలిసి వెన్నెల తన భర్త రమేశ్‌ను గొంతు నులిమి హతమార్చింది. మృతదేహం ఎవరికీ దొరకకుండా ఉండాలంటే.. వాళ్లు పని చేస్తున్న కొత్త ఇంటినే ఎంచుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఇల్లు కావటంతో.. ఎవరికీ అనుమానం రాదని అదే ఇంట్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు.
ఇంతా చేసి.. ఏమీ తెలియనట్టు తిరిగి తమ స్వస్థలానికి వెళ్లింది. తన భర్త కనిపించట్లేదని.. అక్కడికి గానీ వచ్చాడా..? అంటూ బంధువులను వాకబు చేసింది. వెన్నెల మీద అనుమానం వచ్చిన బంధువులు.. నిలదీయగా అసలు విషయం ఒప్పేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రమేశ్ కుటుంబసభ్యులు ఎల్లారెడ్డికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పాతిపెట్టిన చోట తవ్వి బయటకు తీసి అక్కడే పంచనామా పూర్తి చేశారు. నిందితులను చట్టప్రకారంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.