భార్య తన భర్త హెచ్చరికను పట్టించుకోకుండా వేళ కాని వేళలో మరొక వ్యక్తికి రహస్యంగా ఫోన్ కాల్స్ చేయడం వైవాహిక క్రూరత్వానికి సమానమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమకు విడాకులు మంజూరు చేయాలంటు ఓ జంట దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
వ్యభిచారం, క్రూరత్వం కారణంగా తమ వివాహాన్ని రద్దు చేయాలని గతంలో ఫ్యామిలీ కోర్టులో ఓ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కేరళ హై కోర్టును సదరు భర్త ఆశ్రయించాడు.
ఈ కేసుపై విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడినట్టు సాక్ష్యాలు ఉన్నంత మాత్రాన ఆమె వ్యభిచారానికి పాల్పడినట్టు నిర్దారించలేమని తెలిపింది.
తమ వివాహాని కన్నా ముందే తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని, పెండ్లి తర్వాత కూడా ఆ బంధాన్ని ఆమె కొనసాగిస్తోందని భర్త అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో తనపై భర్త, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ 2012లో ఆమె ఫిర్యాదు చేసింది.
దీంతో ఇరువురి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ కేసులో భార్య మరో వ్యక్తితో ఆఫీసులో కాకుండా మరే ఇతర ప్రదేశంలో భర్త చూడలేదని కోర్టు తెలిపింది. భర్త అభియోగాలను నిరూపించేందుకు సాక్ష్యాలు సరిపోనందున వివేహేతర బంధం అనే కోణాన్ని కోర్టు కొట్టి వేస్తున్నట్టు తెలిపింది.
భర్త హెచ్చరికలు చేస్తున్నప్పటికీ రెండో వ్యక్తితో ఫోన్ మాట్లాడటంపై భార్యను కోర్టు మందలించింది. భర్త హెచ్చరిస్తున్నా వేళ కాని వేళలో అలా వేరే వ్యక్తితో ఆ భార్య మాట్లాడటం వైవాహిక క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.