ఇటీవల కాలంలో కొందరు పవిత్ర వివాహ బంధానికి కళంకం తీసుకొస్తున్నారు. వివాహేతర సంబంధం కోసం ఏకంగా భర్తనే హతమారుస్తున్నారు. ఇదే కోవలో ప్రియుడిపై మోజులో భర్తను ఓ వివాహిత హత్య చేసింది. ఇంట్లో మంచి జరగాలంటే.. గ్రామ దేవతకు కోడిపుంజును బలి ఇద్దామని భర్తకు చెప్పి.. కోడి పుంజును బలివ్వడానికి భర్తను పంపింది. ముందే ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలను నిలువునా తీసి.. గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టింది. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్‌కు చెందిన బాల స్వామి(39)కి, లావణ్యతో 10 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. బాలస్వామి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మదనపురం మండలం దంతనూర్ గ్రామానికి చెందిన నవీన్ లాక్ డౌన్ సమయంలో వనపర్తిలో ఉన్న తన స్నేహితులను కలిసేందుకు వస్తుండేవాడు. ఆ సమయంలో లావణ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తరుచూ భార్యాభర్తల మధ్య గొడవ కాస్త.. ప్రియుడి మోజులో పడేందుకు కారణమైంది.
ఈ క్రమంలో గత అయిదు నెలల క్రితం బాల స్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో బయటకు వెళ్లిపోవాలనుకుంది. కానీ, భర్తను అంతమొందిస్తేనే ఈ సరసాలు సాధ్యమవుతాయని లావణ్య నిర్ణయించుకుంది. భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.
పథకం ప్రకారం.. వనపర్తి శివారులోని మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, సమస్యలు అన్నీ తీరిపోయి కాపురం సవ్యంగా సాగుతుందని లావణ్య భర్తను నమ్మించింది. జనవరి 21న అర్ధరాత్రి ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపించి ఈ విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. ప్పటికే అక్కడ వేచి ఉన్న నవీన్ సుపారీగ్యాంగ్‌తో.. బాల స్వామిని బలవంతంగా కారులో ఎక్కించి గొంతు నులిమి చంపేశారు. అనంతరం కందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతడి సెల్‌ఫోన్‌ను పడేశారు. బంగారి అనే వ్యక్తి సాయంతో డెడ్‌బాడీని హైదరాబాద్‌లోని బాలాపూర్ శివారుకు తరలించి పాతిపెట్టారు.
అయితే, అర్ధరాత్రి బయటకు వెళ్లిన బాలస్వామి ఇంటికి తిరిగి రాలేదు. లావణ్య కూడా ఇంట్లో కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన బాలస్వామి తమ్ముడు కొమ్మరాజు జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా ఇటీవలే లావణ్య, నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. బాలస్వామిని హత్య చేసేందుకు పాన్‌గల్‌కు చెందిన కురుమూర్తి, బంగారయ్య, గణేష్‌లతో రూ. 2 లక్షల సుపారీ మాట్లాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని వెలికి తీసేందుకు నిందితులను వనపర్తి పోలీసులు గురువారం బాలాపూర్‌కు తీసుకెళ్లారు.