క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిండు జీవితాలను బలిగొంటున్నాయి. భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని అంబర్‌పేట్ లో చోటు చేసుకుంది.
వివరాలోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్‌పేట్ లోని తిరుమలనగర్ లో శ్రీనివాసులు, విజయలక్ష్మి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు బైక్ మీద తిరుగుతూ ఇంటింటికి వెళ్లి చీరలు.. బ్లౌజ్ మెటీరియల్స్ అమ్ముతుంటాడు. ఖాళీ సమయాల్లో టైలరింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే భార్యకు ప్రేమతో ఓ జాకెట్ కుట్టాడు. అయితే అది విజయలక్ష్మికి నచ్చలేదు. మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. తాను కుట్టిన జాకెట్ నచ్చలేదనడంతో బ్లౌజ్ కుట్లు విప్పేసి నచ్చినట్టు కుట్టుకో అని గట్టిగా చెప్పాడు శ్రీనివాసులు. దీంతో మనస్థాపానికి గురైన విజయలక్ష్మి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్‌కి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి బెడ్ రూమ్ డోర్ కొట్టారు. ఎంతకూ తీయకపోవడంతో శ్రీనివాసులు బలంగా తలుపులు నెట్టాడు. అప్పటికే విజయలక్ష్మి చనిపోయి కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.