సోనూసూద్.. ఇండియాలో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. ఆయన సినిమాల్లో విలనే అయినప్పటికీ.. నిత్య జీవితంలో హీరో. చాలా మంది యువకులకు ఆయన ఓ మార్గదర్శి. కరోనా గడ్డు కాలంలో ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. సారూ.. అని పిలిస్తే.. నేనున్నాను అంటూ స్పందించి.. అనేక మంది అభాగ్యులను సొంత స్థావరాలకు పంపిన రియల్ హీరో సోనూసూద్.
అలాంటి సోనూకు.. ఓ హాస్యాస్పదమైన టాస్క్ ఎదురైంది. ఓ వ్యక్తి తనకు సాయం అందించాలని ఆయనకు ట్వీట్ చేశారు. తన భార్యనుండి ఎలాగైనా కాపాడాలని సోనూసూద్ కు ఫన్నీ ట్వీట్ చేశాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘సోనూ బాయ్.. మీరు ప్రతి ఒక్కరికీ సాయం చేస్తుంటారు. నా భార్య రోజు నా రక్తం తాగుతోంది (హింసిస్తోంది). దీనికి మీ దగ్గర ఏమైనా పరిష్కారముందా..? ఒకవేళ ఉంటే చేతులు జోడించి అడుగుతున్నా… దయచేసి నా భార్య నుంచి నన్ను రక్షించండి’అని ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తి సోనూసూద్ కు ట్వీట్ చేశారు.
అతని ట్వీట్ కు వెంటనే స్పందించిన సోనూసూద్.. అంతే ఫన్నీగా సమాధానమిచ్చారు.‘భాయి.. ఇది ప్రతి భార్యకు జన్మతో వచ్చే అధికారం. నా మాట విను. ఆ రక్తంతో ఓ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చెయి’ అని హాస్యంగా బదులిచ్చారు.