తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరింత దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా తెలివిగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆయన మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వివిధ నియోజకవర్గాలను చుట్టేస్తున్న బండి.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను అవగతం చేసుకుంటున్నారు. ఈక్రమంలో వివాదాలు లేని స్థానాల్లో ఇప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల సమయంలో హడావుడిగా అభ్యర్థులను ప్రకటించి.. గెలిచే అవకాశాలను పార్టీ చేజేతులా పొగొట్టుకుంటోందని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు బండి వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది. ఉన్నట్టుండి పేరు ప్రకటించడంతో కొందరు అసంతృప్తులు పార్టీ మారి దెబ్బతీస్తున్నారని. ఫలితంగా తీవ్రంగా నష్టం జరుగుతోందని వివరించారట. వారు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకున్న బండి సంజయ్.. కొన్ని చోట్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. పాదయాత్ర ముగింపు సభలో.. ఇందుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశముందని మాటలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి మొదలుపెట్టిన పాదయాత్రను.. మొత్తం 22 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల గుండా సాగేలా బండి ప్రణాళిక వేసుకున్నారు. ఆయా నియోజకవర్గాలను చుట్టే క్రమంలో స్థానిక నేతల బలాబలాలను అంచనా వేస్తున్న బండి సంజయ్.. ఎలాంటి వివాదం లేని, అలాగే బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జాతీయ నాయకత్వం అనుమతి కూడా తీసుకున్నట్టుగా ప్రచారం జరగుతోంది. దశలవారీగా పాదయాత్రలు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న బండి.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇదే వ్యూహాన్ని అవలంబించాలని భావిస్తున్నట్టుగా సమాచారం.