ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్…?
50 రోజులుగా జరుగుతున్న ఆర్టీసి సమ్మెలో ప్రతిపక్షాల పాత్ర ఎంత?
జెపి నడ్డా రోజు ఫోన్ చేస్తున్నారన్న బీజేపీ ఎక్కడ?
మిలియన్ మార్చ్ లో బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ?
అందివచ్చిన అవకాశాన్ని వాడుకోవడం కూడా బీజేపీ, కాంగ్రెస్ కు తెలియదా??
గత 50 రోజులుగా ఆర్టీసి సమ్మె జరుగుతోంది. ఒక్క తాటిపై కార్మికులు సకల జనుల సమ్మె ను మించిన సమ్మె ను చేస్తున్నారు. ఏ పార్టీ అండ లేకుండానే కార్మికులు పిడికిలి బిగించి పోరాటం చేస్తున్నారు. ఆర్టీసి కార్మికుల కుటుంబాలు జీతాలు లేక , ఆకలితో అలమటిస్తూ బతుకు పోరాటం చేస్తున్నారు. అన్నీ ఉండి , కార్మికుల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఇంట్లో పడుకున్నాయి. సమావేశానికో సూటు , బూటు మారుస్తూ మీడియా ముందు కలరింగ్ ఇవ్వడం, ఊక దంపుడు ఉపన్యాసాలతో కాలం గడపడం ఇంతకు మించి ఆర్టీసి సమ్మె విషయంలో వీరు చేసిందేమిటి?
ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమ్మె మొదటి రోజుల్లో హడావిడి చేసింది. ఏకంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, జెపి నడ్డా ప్రతి రోజూ ఫోన్ చేస్తున్నారు, ఏమైనా జరగొచ్చు అంటూ మాట్లాడారు. పలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగాలు దంచి కొట్టారు. కార్మికుల్లో ఉత్సాహం వచ్చింది. బీజేపీ మాత్రమే మమ్మల్ని ఆదుకుంటుందని కార్మికులంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే , బీజేపీ సంకల్ప యాత్ర పేరుతో , నాయకులంతా జిల్లాలకు పరిమితమయ్యారు. కరీంనగర్ లో ఒక్క బండి సంజయ్ పోరాటం తప్ప ఏ ఒక్క బీజేపీ నాయకుడు ప్రత్యక్ష పోరాటంలో లేకుండా పోయారు. సరూర్ నగర్ లో జరిగిన ఆర్టీసి సమర భేరి సభకు కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హజరు కూడా కాలేకపోయారు. ఇప్పుడు ఏకంగా సినిమా చూస్తున్నట్టు సైలెంట్ అయిపోయారు. కార్మికులు బీజేపీ పై పెట్టుకున్న ఆశలని ఆ పార్టీ వమ్ము చేసిందనే చెప్పాలి.
ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పటికీ , పార్టీలో నాయకులు మాత్రం చాలా మందే ఉన్నారు. అసలు ఈ పార్టీ కి ఆర్టీసి విషయంలో కార్యాచరణ లేదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రోజు రోడ్డు మీదకొచ్చి కార్మికుల పక్షాన పోరాటం చేసింది లేదు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఎవరి సొంత కార్యక్రమాలు వాళ్ళవి. ఇలా కాంగ్రెస్ కూడా ఆర్టీసి కార్మికుల సమస్యను పక్కన పడేసింది. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మిలియన్ మార్చ్ లో లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజల సమస్యలు వద్దు కానీ, ఎన్నికల్లో ఓట్లు, సీట్లు కావాలి. ఇది కాంగ్రెస్ పరిస్థితి
అంతో ఇంతో కోదండరాం అన్ని పార్టీలను, సంఘాలను కలిపి ఉద్యమ కార్యాచరణ రూపొందించినా ,బీజేపీ కాంగ్రెస్ సహకారం లేకుండా ఏమి చేయలేకపోయారు.ప్రతిపక్షాలు గట్టిగా పోరాడి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కనీసం బీజేపీ, కాంగ్రెస్ కు అందివచ్చిన అవకాశాన్ని వాడుకునే తెలివి కూడా లేదని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.
ఒకటి మాత్రం నిజం. ఆర్టీసి కార్మికుల పోరాటం అద్భుతం.ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం లో కార్మికులు విజయం సాధించారు.పార్టీల సహకారం పెద్దగా లేకపోయినా కార్మికులు చేసిన పోరాటం అనిర్వచనీయం.ఇక్కడ కెసిఆర్ గెలిచాడ న్న కొందరి వాదన అర్థరహితం. గెలిచింది కార్మికులే.