– 119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్..
– వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమంటున్న బండి
– నిజంగా బీజేపీ అన్నింటా స్ట్రాంగ్ గా ఉందా?
– గ్రూప్ రాజకీయాల సంగతేంటి..?
– 119 మంది అభ్యర్థులు ఉన్నారా?
– ఉన్నా.. వారిలో జనం లీడర్స్ ఎంతమంది?
– రాజకీయ పండితులు ఏమంటున్నారు?
తెలంగాణలో అధికారం చేపట్టాలనేది బీజేపీ లక్ష్యం. సౌత్ లో బలంగా ఉన్న కర్ణాటకలా మిగిలిన రాష్ట్రాల్లో బలోపేతం కావాలని తెగ ప్రయత్నిస్తున్నారు కమలనాథులు. తెలంగాణలో ఈసారి గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. దీనికోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగులు అంటూ కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కు శ్రీకారం చుట్టారు. బూత్ స్థాయిలో కమిటీల నియామకం వంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నారు. బేస్ లెవల్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటే గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీదే గెలుపని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ బీజేపీ అని.. కేసీఆర్ పాలనపై జనానికి పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని విమర్శలు చేస్తున్నారు. అయితే.. బండి మాటలు కోటలు దాటుతున్నాయే గానీ.. చేతలు ఆ రేంజ్ లో లేవనేది విశ్లేషకుల వాదన. ఎంతసేపటికీ కేసీఆర్ సర్కార్ అంత అవినీతి చేసింది.. కల్వకుంట్ల కుటుంబం ఎంతో సంపాదించింది అని చెప్పడమే గానీ.. కేంద్ర పెద్దలతో గట్టిగా మాట్లాడి చర్యలు తీసుకుంది ఏమీ లేదని అంటున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపిస్తే బీజేపీకే ప్లస్ అవుతుంది. కానీ, ఆ దిశగా కమలనాథుల అడుగులు పడడం లేదని చెబుతున్నారు.
గురువారం బూత్ స్వశక్తికరణ్ అభియాన్ పై నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. 119 సెగ్మెంట్లలో చాలా చోట్ల గెలుస్తామని అన్నింటా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నారు. అయితే.. నిజంగా బీజేపీ బలంగా ఉందా? అంటే విశ్లేషకుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒక్క స్థానమే గెలిచింది. లోక్ సభ ఎన్నికలు కాస్త బూస్టప్ ఇచ్చినా.. ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఇమేజ్ వల్లే గెలిచిందని అంటున్నారు. దీనికే అధికారం చేపడతామని చెప్పడం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ లా ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
మరోవైపు పార్టీలోకి చేరికల తుపాను ఉంటుందని కమలనాథులు చెబుతూ వచ్చారు. కానీ, ప్రజల్లో ఫాలోయింగ్ ఉండి.. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలెవరూ బీజేపీ వైపు చూసింది లేదు. దీనికితోడు ఉన్న కొద్దిమంది లీడర్ల మధ్య సఖ్యత చెడిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. నాయకులంతా ఒక్కటైతే బీజేపీకి మంచి ఫలితాలే ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. దీనికి ఇప్పుడు చేపడుతున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బూత్ స్వశక్తికరణ్ అభియాన్ లాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే అనుకున్న లక్ష్యాలు నెరవేరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. మొత్తానికి బీజేపీ నేతలు మాటల్లో కాకుండా చేతల్లో పార్టీని బలోపేతం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు తక్కువ సమయం ఉందని అంటున్నారు విశ్లేషకులు.