దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు తెలంగాణ బీజేపీకి బూస్ట్ ఇచ్చినట్లయింది. ఈ గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేసే పనిలో బీజేపీ ఉంది. గ్రేటర్ పరిస్థితులు దుబ్బాకతో పోల్చితే ఇంకాస్త అనుకూలంగానే ఉండటంతో బీజేపీ దూకుడు మీదుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ దూకుడును ఏపీ బీజేపీ అందుకునే ప్రయత్నంలో ఉంది.
దుబ్బాక లాగే తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. దీంతో నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… ఇప్పటికే 2 నెలలు పూర్తయ్యాయి. దీంతో త్వరలో తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.
దీంతో తిరుపతి ఉప ఎన్నిక కోసం ఇప్పటికే బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. బీజేపీ-జనసేన పొత్తు కొనసాగేప్పటికీ ఇక్కడ బీజేపీయే పోటీ చేయనుంది. గతంలో ఓసారి ఇక్కడి నుండి బీజేపీ గెలిచిన చరిత్ర కూడా ఉండటంతో… ఇక్కడ గెలిచి ఏపీలో వైసీపీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే పనిలో బిజీగా ఉంది. ఏపీ వ్యవహరాల ఇంచార్జ్ సునీల్ దియోదర్ ఇప్పటికే అక్కడ మకాం వేశారు. టెంపుల్ సిటీ కూడా కావటంతో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. రిజర్వ్ స్థానం కావటంతో ఇక్కడి నుండి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతుండగా… టీడీపీ పోటీలో ఉంటుందా దూరంగా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు వైసీపీ ఎవర్ని రంగంలోకి దింపుతుంది అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికే తిరుపతి టార్గెట్ గా కార్యక్రమాలు షురూ చేసింది.