హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైంది. కేసీఆర్ కు అనుచరుడిగా, టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యనేతగా ఉన్న ఈటల రాజేందర్ తరువాత ఒక్కొక్కరుగా కారు దిగే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. తాజాగా రవీందర్ సింగ్ టీఆర్ఎస్ ను వీడడంతో ఆ అనుమానం ఇంకాస్త బలపడింది. అయితే ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల పైన పడుతుందేమో అనే భయం కూడా టీఆర్ఎస్ లో మొదలైంది. తాజాగా ఈటల రాజేందర్ కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రవిందర్ సింగ్ ను గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఇటు నిన్నటి వరకు క్యాంపుల్లో ఉన్న ఓటర్లను వదిలేసి వారి కుటుంబాలను టార్గెట్ చేసి తన ప్లాన్ అమలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే రిజర్వేషన్ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పినట్టు ఓటు వేయాలంటూ ఓటర్ల కుటుంబాలకు హామీలు ఇస్తూ.. ఫ్యామిలీ ప్లాన్ అమలు చేస్తున్నారు ఈటల అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ.
హుజురాబాద్ ఉప ఎన్నిక అనంతరం చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు ఈటలకు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా చేరదీస్తూ.. మీకు నేనున్నాను అని భరోసా కల్పిస్తూ.. అందరినీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఒక హుజురాబాద్ నియోజకవర్గమే కాకుండా కరీంనగర్ జిల్లాలోని వివద ప్రాంతాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు టచ్ లో ఉన్నట్టు సమాచారం. అంతే కాదు మద్యవర్తుల ద్వారా రాయబారం కూడా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే తన ప్రచారంలో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడమే తన లక్ష్యమని.. ఇక్కడ దెబ్బ కొడితే తన మీద మాటల తూటాలు పేల్చిన టీఆర్ఎస్ మంత్రులకు అక్కడ దిమ్మ తిరుగుతుందని తన ప్రచారంలో చెపుతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే… తామే గెలుస్తామనే ధీమాలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మండలి ఎన్నికల్లో 90 శాతం ఓట్లతో బలంగా ఉన్నామని.. కాంగ్రెస్, బీజేపీ నేతలు స్వతంత్ర అభ్యర్ధులను కూడా తమ ఓటర్లుగానే చేప్పుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈటల వ్యూహం ఫలించి టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోతే ప్రచారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల పైన కూడా ప్రభావం పడుతుందనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.
Also Read: 2030..సొంత అంతరిక్ష కేంద్రం!