మీరు చూపుతోన్న ప్రేమ మీద ఒట్టు మీ జీవితాలలో మార్పు కోసం ఎందాకైనా పోరాడుతా.. అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సోమవారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభించారు ఆయన. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతల దర్శనం తరువాత యాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డికి గిరిజన పూజారుల సాంస్కృతి సాంప్రదాయాలతో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
జిల్లాలోని గోవిందరావు పేట మండలం ప్రాజెక్టు నగర్ నుంచి పాదయాత్రలో వస్తున్న రేవంత్ రెడ్డి, పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. దీంతో రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పండు ముసలి నుంచి పసిబిడ్డల వరకు చూపిస్తోన్న అభిమానం.. కురిపిస్తున్న ప్రేమే నా పోరాటానికి ఇంధనమన్నారు. పరవళ్లు తొక్కుతున్న మీ ఉత్సాహం నా బాధ్యతను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తోందన్నారు.
మీరు చూపుతోన్న ప్రేమ మీద ఒట్టు మీ జీవితాల్లో మార్పు కోసం ఎందాకైనా పోరాడుతానని ఆయన సోషల్ మీడియా వేదికగా తనను ఆదరిస్తున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర 50 నియోజక వర్గాల్లో ప్రభావం చూపే విధంగా టీ కాంగ్రెస్ పెద్దలు రూట్ మ్యాప్ ను సిద్ధం చేయడం జరిగింది.
మరో వైపు మిగతా నియోజక వర్గాల్లో కూడా టీ కాంగ్రెస్ కీలక నేతలు ఈ యాత్రను చేపట్టనున్నారు. ఇది ఇలా ఉంటే.. కేసీఆర్ సర్కార్ పై ఛార్జ్ షీట్లను నమోదు చేస్తూ హల్ చల్ చేస్తుంది ఈ పార్టీ. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ..టీ కాంగ్రెస్ లో వేడి మొదలైందనే చెప్పొచ్చు.