లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీశ్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. లఖీంపూర్ లో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు రైతు సంఘాలు నిర్ణయించారు.
దీని కోసం కావాల్సిన పత్రాలను తయారు చేస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రతినిధి రాకేశ్ తికాయత్ తెలిపారు. ‘ ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇలాంటి కేసులోనే నిందితుడు మూడు నెలల్లో బయటికి వచ్చాడు. అలాంటిది మిగతా కేసుల్లో ఇంకా ఎలా ఉంటుంది. దీన్ని బీజేపీ లబ్ది పొందుతున్నట్టు కనిపిస్తోంది” అని అన్నారు.
“ఆన్ లైన్ విచారణ సమయంలో రైతుల వంతు వచ్చినప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య వచ్చింది. ఆ సమయంలో రైతులు తమ వాదనను వినిపించలేకపోయారు. అలాంటి సమయంలో ఒక న్యాయమూర్తి తన ముందు ఉంచిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. చట్టం చెప్పినట్లే కోర్టు చేస్తుంది. ఈ కేసులో మేము మా వాదనను సరిగ్గా వినిపించలేకపోయాము ‘ అని పేర్కొన్నారు.
మరో నేత శివకుమార్ కక్క మాట్లాడుతూ… ‘ ఇందులో ప్రభుత్వ పాత్ర ఉంది. అక్కడ ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నారు. అక్కడ ప్రాసిక్యూషన్, పోలీసులు ఉన్నారు. కానీ వారెవరూ తమ డ్యూటీని సరిగా నిర్వహించలేకపోయారు” అని అన్నారు.