పుష్ప సక్సెస్ తరువాత చాలా తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను రిలీజ్ చేయటానికి ఇష్టపడుతున్నాయి . గత వారం, రవితేజ ఖిలాడీ తెలుగు వెర్షన్‌తో పాటు హిందీలో ఒకేసారి విడుదలైంది.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా అదే బాటలో వెళ్లేందుకు రెడీ అయింది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
భీమ్లా నాయక్‌ని హిందీలో ప్రమోట్ చేయడానికి నిర్మాతలు రానా దగ్గుబాటి ని లైన్ లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రానాకు ఉత్తర భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. బాహుబలితో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.
ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. కాగా అయ్యప్పనుమ్ కోషియమ్ హిందీ రీమేక్ హక్కులను జాన్ అబ్రహం కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ హిందీలో విడుదలైతే, జాన్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి భీమ్లా నాయక్ సినిమాను హిందీలో విడుదల చేయకుండా జాన్ ప్రయత్నిస్తాడో లేదో చూడాలి.
నిజానికి ఇటీవల హిందీలో అలా…వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే హిందీలో రీమేక్ అవుతున్నందున, రీమేక్ రూపకర్తలు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో విడుదల చేయనివ్వలేదు. మరి ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో అదే జరుగుతుందేమో చూడాలి.
ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.