జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వారసుడిగా… రామారావు నట వారసుడిగా గుర్తింపు పొందారు. అందుకే పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో ఎన్నికల ప్రచారం తన భుజాలపై వేసుకున్నారు. తన ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నారు. కానీ అంతే స్పీడుగా 2009 ఎన్నికల తర్వాత వెనక్కి వెళ్లిపోయారు.
ఎన్టీఆర్ సైలెంట్ అయ్యాక ఎన్టీఆర్ సన్నిహితుడిగా ముద్రపడ్డ కొడాలినాని వైసీపీ తీర్థం పుచ్చుకోవటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమే అయింది. ఎన్టీఆరే సైలెంట్‌గా వైసీపీలోకి పంపించారని ఓ వర్గం టార్గెట్ చేసింది కూడా. అయినా ఎన్టీఆర్ ఎక్కడా నోరు విప్పలేదు. ఇక ఎన్నికల ముందు ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ గూటికి చేరిపోయారు. దాంతో ఎన్టీఆర్-చంద్రబాబు మధ్య సత్సంబంధాలు అంతగా లేవని మరోసారి చెప్పకనే చెప్పినట్లయింది.
ఇక తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవటం మళ్లీ అందరి కళ్లు జూనియర్‌పై పడ్డాయి. వంశీ కూడా ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. పైగా వంశీ పార్టీని వీడుతూ చేసిన కామెంట్ కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. తన పదేళ్ల కేరీర్‌ను పణంగా పెట్టి జూనియర్ టీడీపీకి ప్రచారం చేస్తే, ఆయన్ని కూడా చంద్రబాబు పక్కనపెట్టేశారని వంశీ ఆరోపించారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు ఒక్కొక్కరిగా వైసీపీ గూటికి పయనం అవుతుండటంతో… జూనియర్ కూడా చంద్రబాబుపై తిరుగుటాటు చేస్తారా…? నందమూరి ఫ్యామిలో ఉన్న చంద్రబాబుపై అసంతృప్తి జూనియర్ ద్వారా బయటపడుతుందా…? జూనియర్ తిరుగుబాటు చేస్తే చంద్రబాబు పరిస్థితేంటీ…? అన్న సందేహాలు టీడీపీ సహా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.