- కేంద్ర ప్రభుత్వానికి సీఎం ఘాటుగా లేఖ..
- స్పందించకపోతే సుప్రీం కు కేసీఆర్
- పది పేజీల లేఖపై అధికారుల చర్చలు
- రాష్ట్రాల రుణ పరిమితులపై ఆంక్షలపై గరం గరం
సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారా? రాష్ట్రాలు చేసే రుణాలపై పరిమితులు విధించడంతోపాటు సంస్కరణలకు, రుణ పరిమితికి లంకె పెడుతూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని అత్యున్నత న్యాయస్థానం వెళ్తారా? మోదీ సర్కారు తీరును సుప్రీంకోర్టులో ఎండగట్టనున్నారా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న తన నివాసంలో ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపినట్లు తెలిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై సీఎం చర్చలు జరిపినట్లు సమాచారం. బుధవారం ఆయన సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, విద్యుత్తు శాఖ కార్యదర్శి సునీల్ శర్మతో పాటు పలువురు అధికారులు, న్యాయనిపుణులతో మంతనాలు జరిపారు. తొలుత కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాయాలని, అందుకు సరైన జవాబు రాకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని వారు సూచించినట్లు సమాచారం. కేంద్రం విధించే ఆంక్షల పర్యవసానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై పడే ప్రభావం గురించి చర్చించిన కేసీఆర్.. బుధవారమంతా కేంద్రంపై ఏ విధంగా దాడి చేస్తే బాగుంటుందన్న అంశంపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది.
కేంద్ర ఆర్థిక శాఖ 2022 మార్చి 31న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి రాసిన పది పేజీల లేఖపై అధికారులు చర్చలు జరిపారని సమాచారం. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాల జీఎస్డీపీలో 3.5 మేరకు నికర రుణ పరిమితిని విధించామని కేంద్రం ఆ లేఖలో పేర్కొందని, నిజానికి ఆర్థిక సంఘం అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని పూర్తిగా సవరించాలని సూచించిందన్నారు. కేంద్రం మాత్రం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ నికర రుణ పరిమితిని పాటించకుండా రాష్ట్రాలపై ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక విద్యుత్తు రంగం పనితీరునుబట్టి అదనపు రుణ పరిమితిని జీఎస్డీపీలో మరో 0.5% పెంచుతామని కేంద్రం లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా పరిమితులు విధించడం చెల్లదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక కార్పొరేషన్లు, ఇతర సంస్థలు చేసే రుణాలపై కేంద్రం ఎలా ఆంక్షలు విధిస్తుందని? వాటికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోనవసరం లేదనీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రం కేంద్రం నుంచి, మార్కెట్ నుంచి చేసే అప్పులకు మాత్రమే రుణ పరిమితిని వర్తింపజేయాలని.. కార్పొరేషన్లు చేసే అప్పులనూ రాష్ట్ర రుణాలుగా పరిగణించే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నట్లు సమాచారం.
స్థూల రుణ పరిమితిని నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సమర్పించాలనడం సరికాదని భావించినట్లు తెలిసింది. రాష్ట్రాలు చెల్లించే పన్నుల ద్వారా పెత్తనం చలాయించే కేంద్రం తన లెక్కల్ని కూడా అదే విధంగా వెల్లడించాలని, వివిధ మార్గాల్లో సమీకరించే నిధులకు జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నట్లు సమాచారం. త్వరలో అన్ని అంశాలపై కేసీఆర్ కేంద్రానికి ఘాటుగా లేఖ రాస్తారని, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఈ విషయం చర్చిస్తారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు.