– రేపు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
– వంద ఎకరాల్లో సభా ఏర్పాట్లు
– జాతీయ మీడియా పక్కాగా కవర్ చేసేలా ప్లాన్
– రాష్ట్రానికొచ్చే నేతలతో పలు కార్యక్రమాలు
– ముందుగా ప్రగతి భవన్ లో భేటీ
– యాదాద్రి టూర్.. కలెక్టరేట్, కంటివెలుగు ప్రారంభోత్సవాలు
– రోజంతా మీడియాలో వచ్చేలా బిజీ షెడ్యూల్
– ఈసారి జాతీయ మీడియా కవరేజ్..
– జాతీయ నేతగా ప్రమోట్ పక్కానా?
జాతీయ రాజకీయాల లక్ష్యంతో మొదట రాష్ట్రాల టూర్లు పెట్టుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొందరు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిశారు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ప్రాంతీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చూశారు. కానీ, సరిగ్గా వర్కవుట్ కాలేదు. అనేక విమర్శలు, అవమానాలు, సవాళ్ల తర్వాత టీఆర్ఎస్ నే జాతీయ పార్టీగా ప్రకటించారు. కలిసివచ్చే పార్టీలను కలుపుకుంటూ పోవాలని రైతు రాజ్యం నినాదంతో రాజకీయం నడిపిస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఢిల్లీ టూర్లు పెట్టుకున్నా.. హస్తినలోనే కేంద్రానికి వ్యతిరేకంగా పోరు సాగించినా.. వివిధ రాష్ట్రాల నేతలను కలిసినా.. జాతీయ మీడియా అంతగా ఫోకస్ పెట్టింది లేదు.
కేసీఆర్ ను ప్రాంతీయ పార్టీ నేతగానే చూస్తూ వస్తోంది జాతీయ మీడియా. కానీ, ఖమ్మం సభ తర్వాత సీన్ మారిపోతుందని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మంత్రి హరీష్ రావు అయితే.. జాతీయ రాజకీయాల్లో ఇకపై బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందని నొక్కి మరీ చెబుతున్నారు. కాంగ్రెస్ రోజురోజుకీ బలహీన పడుతోందని ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారని అంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే పాట పాడుతున్నారు. ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. దీనికోసం మూడు రాష్ట్రాల సీఎంలకు పలువురు జాతీయ నేతలకు ఆహ్వానం పంపారు కేసీఆర్.
దాదాపు 500 ఎకరాల్లో ఈ సభా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను వంద ఎకరాల్లో నిర్వహిస్తుండగా.. పార్కింగ్ కోసం 400 ఎకరాలకు పైగా వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ కి, తనకు జాతీయ ఇమేజ్ తెచ్చేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ సభ నిర్వహించడమే కాకుండా.. తన కోసం జాతీయ నేతలు తరలివచ్చారని మీడియా కంట్లో పడాలన్నదే ఆయన ప్లాన్ గా కనిపిస్తోందని అంటున్నారు. సభ కోసం ముగ్గురు సీఎంలు, ఇతర నేతలు వస్తున్నారంటే.. జాతీయ మీడియా పక్కాగా తెలంగాణ వైపు చూస్తుందనే ఉద్దేశంతో వారందరికీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని చెబుతున్నారు. రోజంతా బిజీగా ఉండేలా కేసీఆర్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారని వివరిస్తున్నారు.
కేరళ సీఎం పనరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మాజీ సీఎం అఖిలేష్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాలను బుధవారం వివిధ కార్యక్రమాలలో భాగస్వాములను చేశారు కేసీఆర్. ముందుగా ఉదయం ప్రగతి భవన్ లో కేసీఆర్ తో వీరంతా సమావేశం అవుతారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించి.. బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్తారు. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటారు. అటునుంచి ఖమ్మం వెళ్లి కొత్త కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. నలుగురు ముఖ్యమంత్రులు, అఖిలేశ్, రాజా చేతులమీదుగా కంటివెలుగు రెండో విడతకు శ్రీకారం చుడతారు. లంచ్ తర్వాత బహిరంగ సభకు హాజరవుతారు. ఇలా జాతీయ నేతలను బీఆర్ఎస్ కార్యక్రమానికి పిలిచి.. మీడియా అటెన్షన్ అంతా తనవైపు ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేశారని అంటున్నారు విశ్లేషకులు. ఈసారి జాతీయ మీడియా కచ్చితంగా ప్రాధాన్యం ఇచ్చేలా.. తనను జాతీయ నేతగా గుర్తించేలా వ్యూహం రచించారని చెబుతున్నారు.