– ఓటమి భయమా? ఇంకేమైనా కారణమా?
– ఈసారి సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్నారా?
– మరి.. హరీశ్ రావు పరిస్థితేంటి?
– లోక్ సభకు పంపి.. కేటీఆర్ కు లైన్ క్లియర్ చేస్తారా?
– పీకేతో వరుస మంతనాలు..
– కేసీఆర్ అసలు వ్యూహం ఏంటి?
ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందా? దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఎమ్మెల్యేగానా? ఎంపీగానా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఏకాంత భేటీల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నల చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
ఉద్యమ సమయం నుంచి ఇప్పటికా కేసీఆర్ అంతుచిక్కని నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాల ఊహకందని విధంగా ప్రవర్తించారు. అయితే.. ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయ్యేలా ఉన్నాయి. అందుకే పీకేని తెచ్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఎంపీగా పోటీచేస్తారా? లేక.. ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతారా? అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే.. కేసీఆర్ ముమ్మాటికీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారనే వాదన బలంగా జరుగుతోంది. అదికూడా ప్రస్తుతం ప్రాతినథ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కాదు. టీడీపీ హయాంలో గెలిచిన తన పాత సీటు సిద్దిపేట నుంచి. రెండు పర్యాయాలు గజ్వేల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఈ నియోజకవర్గాన్ని వీడి సిద్దిపేటకు మారనున్నారనే చర్చ జరుగుతోంది.
1985లో మొదటిసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కేసీఆర్. తర్వాత 1985, 1989, 1994 వరుసగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2001 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తొలిసారి విజయం సాధించారు. 2004లో కూడా తిరిగి గెలిచారు. ఉద్యమం తీవ్రతరం కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన స్థానంలో అల్లుడు హరీశ్ రావును పోటీ చేయించి గెలిపించుకున్నారు. అయితే.. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధ్యం అయిన తర్వాత.. 2014లో గజ్వేల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2018లో కూడా తిరిగి అక్కడి నుంచే పోటీ చేశారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ తన పాత నియోజకవర్గమైన సిద్దిపేట నుంచే బరిలోకి దిగడం ఉత్తమమని పీకే సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. అంతేదాకు దీని వెనుక పెద్ద ప్లాన్ కూడా ఉందని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ తిరిగి సిద్దిపేటకు వస్తే.. దాదాపు ఇరవై ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిచి పలు మంత్రి పదవులు నిర్వహించిన హరీశ్ కూడా చెక్ పెట్టొచ్చనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. హరీష్ ను ఈసారి పార్లమెంటుకు పంపి కేటీఆర్ కు మార్గం సుగమం చేయాలనే భావనలో కేసీఆర్ ఉన్నట్లుగా వివరిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బాగున్నా దక్షిణ తెలంగాణలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. అందులో భాగంగానే ఆయన ఈసారి మునుగోడును కూడా ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్.. పార్టీ భవితవ్యం కోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తారు. ఎంతటి త్యాగాలైనా చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈసారి రిస్కీ నిర్ణయాలు తీసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కొత్త ప్లేస్ నుంచి పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చూడాలి మరి భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో?