కష్ట సుఖాలు పంచుకుంటూ అన్నదమ్ముల వలె తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలి, అందుకు ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు సయోధ్యగా ఉంటే తప్పేంటి..? ఇవి ఎవరో అన్న మాటలు కాదు. స్వయంగా కేసీఆర్ అనేకసార్లు వాడిన మాటలు. దీనిపై కేసీఆర్ చాలా గట్టిగా వాదించారు. ఔను నిజమే.. రాష్ట్ర విభజన తర్వాత ఉన్న అనేక సమస్యల్లో వున్న రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సయోధ్యగా ఉండటంలో తప్పులేదు. అదే సమయంలో ఆ రాష్ట్రంలో మంచి ఏదైనా జరుగుతుంటే, అది ఈ రాష్ట్రం కూడా అమలు చేస్తే తప్పేముంది ? మరి దానికి కేసీఆర్ అంగీకరిస్తాడా ? ఏపీలో చేస్తే నేనేందుకు చేయాలి అని కానీ అంటాడా? ఏపీ చేసినట్లు చేస్తే ఇక నా మార్క్ పాలన ఏముంటుంది అని అనుకుంటేనే సీన్ రివర్స్ అవుతుంది. ఇంతకీ ఏపీలో జరిగే మంచి ఏంటీ, తెలంగాణలో కేసీఆర్ చేయాల్సిన మంచి ఏంటి ?
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలు తీవ్రంగా పోటీపడ్డాయి. పథకాలు, కార్యక్రమాల అమలులో పోటాపోటీగా వున్నాయి. ఆయా రాష్ట్రాల ఆర్థిక స్తోమత ఏపాటో చూసుకోకుండా పాత పథకాల పేర్లు మార్చి, ప్రజల్ని ఏమార్చి మరీ సంక్షేమ కార్యక్రమాలు అందించాయి. రైతుబంధు, రైతు బీమా, చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ రైతు భరోసా, కల్యాణలక్ష్మి.. ఇలా పథకాలన్నీ 2 స్టేట్స్‌లో సేమ్ టు సేమ్. పైగా కేసీఆర్-చంద్రబాబు కీచులాడుకుంటున్న సమయంలోనే ఇరు రాష్ట్రాలు ఒకరి పథకాలు ఒకరు పోటాపోటీగా అమలు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్–జగన్ ఇద్దరు మంచి దోస్తులు. అలాంటప్పుడు అక్కడ జరిగే మంచి కార్యక్రమాల్ని ఇక్కడా అమలు చేయడం ఏ మాత్రం తప్పులేదు. తప్పుబట్టరు. కేసీఆర్ చెబుతున్నట్టుగా ఒకరినొకరు మాట్లాడుకుని ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమాలైనా రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలి. ఇప్పుడు ఇలాంటి వాదనే తెలంగాణ కాంగ్రెస్ లేవనెత్తింది. ‘ఏపీలో జగన్ తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేసీఆర్ అభినందించడాన్ని స్వాగతిస్తున్నాం. అక్కడ ఓ ఇరిగేషన్ ప్రాజెక్టులో 12.6 శాతం లెస్‌కు మేఘా కంపెనీ టెండర్ వేసింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా లబ్ధి చేకూరింది. అలాగే తెలంగాణలో కూడా జ్యూడిషియరీ కమిటీ వేసి టెండరింగ్ పర్యవేక్షణ జరిపించాలని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నాం’ అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ ఒక సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్‌కు అర్ధమైందో లేదో కానీ, భట్టి మామూలుగా ఇరికించలేదు. సవాల్ చేసి మరీ ఇరికించారు. దీనికి కేసీఆర్ ఇచ్చే రిప్లయ్ ఎలావుంటుందో తెలంగాణ సమాజం మొత్తం ఎదురుచూస్తోంది. ఒకవేళ కేసీఆర్ భట్టీ మాటల్ని లైట్ తీసుకుంటే కేసీఆర్ చెబుతున్న రెండు రాష్ట్రాల సయోధ్య.. కబుర్లన్నీ వేస్ట్ కిందే జనం జమకడతారు.
ఏపీ-తెలంగాణలో కాంట్రాక్టర్లు దాదాపు ఒక్కరే. తెలంగాణాలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా లక్ష కోట్లు ఖర్చు చేయనుందని, కనుక ఇక్కడ కూడా రివర్స్ టెండరింగ్ చేస్తే ఇక్కడ ప్రాజెక్టుల్లో కూడా 12 శాతం లెస్‌కు టెండర్లు వేసే అవకాశం వుందని, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాల్లో రాష్ట్రానికి 28వేల కోట్లు ఆదా అయ్యేదని అంటున్నారు.
అదే విధంగా మిషన్ భగీరథకు ఇప్పటివరకు 50 వేల కోట్లు అంచనా ఖర్చు చేశారు. దీంట్లో రివర్స్ టెండరింగ్ అమలు చేసి ఉంటే మిషన్ భగీరథలో కూడా 6వేల కోట్లు ఆదా అయ్యేది. రెండూ కలిపితే మొత్తంగా 34వేల కోట్లు ఆదా అయ్యేది. పైగా, ఇరిగేషన్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ మార్జిన్ లెస్‌ను కలిపితే 74 వేల కోట్లకు వెళుతుంది. అంటే, రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మాంద్యం కారణంగా తక్కువ చేసి చూపిన సర్కార్‌కు, మాంద్యం దెబ్బే లేకుండా పోతుంది. భట్టి విక్రమార్క చెప్పిన ఈ లెక్క బానే వుంది. ఇలా చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా వుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు పదేపదే ప్రాజెక్టుల్లో అవినీతిపై సీబీఐ విచారణ కోరుతున్నారు. కేసీఆర్ రివర్స్ టెండరింగ్ విధానానికి ఒప్పుకుంటే ఈ ఆరోపణలు, అభియోగాలు వుండవు గాక వుండవు.
మరీ రివర్స్ టెండరింగ్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం రివర్స్ అటాక్ చేస్తుందా… లేదా కాంగ్రెస్ సవాల్‌ను స్వీకరిస్తుందా అనేది చూడాలి !