– రెండు రోజుల్లో ముగింపు దశకు..
– సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకలు
– శిలాఫలకం విషయంలో అలకబూనిన కేసీఆర్!
– ఎలాగైనా సీఎంను రప్పించాలని చినజీయర్ ప్రయత్నాలు
– మా సారు వెళ్లరని అంటున్న టీఆర్ఎస్ వర్గాలు
సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకో రెండు రోజుల్లో ముగుస్తాయి కూడా. ప్రారంభోత్సవం జరిగిన నాటి నుంచి దేశంలోని చాలామంది ప్రముఖులు రామానుజాచార్యుల అతిపెద్ద విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చారు. ఇంకా వస్తున్నారు. కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అటువైపు చూడడం లేదు. కారణం శిలాఫలకంలో పేరు లేకపోవడమేననే చర్చ జరుగుతోంది.
సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో మోడీ, చినజయర్ ఫోటోలతోపాటు రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ అని రాసి ఉంది. కేసీఆర్ ఫోటోగానీ, పేరుగానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. చినజీయర్, రామేశ్వరరావు ముందే డిసైడ్ అయి కేసీఆర్ ను పిలవొద్దని అనుకున్నారా? మోడీకి, కేసీఆర్ కి మధ్య దూరం ఉందని చూపించే డ్రామా చేస్తున్నారా? ఈ విషయాన్ని కేసీఆర్ దగ్గర చినజీయర్, రామేశ్వరరావు దాచారా? ఒక రోజు ముందే కేసీఆర్ కు తెలిసి హర్టయి కార్యక్రమానికి రాలేదా? చినజీయర్, రామేశ్వరరావుపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా? ఇలా అనేక అనుమానాలు రేకెత్తాయి.
అయితే.. కేసీఆర్ రాక కోసం చినజీయర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో రెండు రోజుల్లో విగ్రహావిష్కరణ వేడుకలు ముగుస్తాయి. ఢిల్లీ నుంచి ప్రముఖులు వచ్చి వెళ్తున్నారు గానీ.. కేసీఆర్ మాత్రం దగ్గరలో ఉన్న ముచ్చింతల్ కు వెళ్లడం లేదు. శిలాఫలకం అవమానాన్ని మనసులో పెట్టుకుని ఆయన అక్కడకు వెళ్లడం లేదనేది రాజకీయ పండితుల వాదన. నిజానికి కేసీఆర్ కు వెళ్లానని లేదని.. అందుకే ఇంత భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతున్నా జిల్లాల పర్యటనలు చేస్తున్నారని అంటున్నారు. పైగా సమతామూర్తి క్షేత్రం కంటే.. యాదాద్రిని ఇంకా వైభవంగా నిర్మించామనేది హైలెట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. జ్వరం వచ్చి ఆవిష్కరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఒకరోజు తర్వాత యాదాద్రి వెళ్లడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మోడీ పర్యటన సందర్భంగా ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. ముచ్చింతల్ లో పనులపై పర్యవేక్షణ జరిపి.. ప్రెస్ మీట్ లో స్వాగతం చెప్తానన్న సీఎం సడెన్ గా వెళ్లలేదు. అదే సమయంలో శిలాఫలకం విషయం తెలిసి ఆయన అలకపాన్పు ఎక్కారని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ ను ఎలాగైనా ముచ్చింతల్ కు తీసుకురావాలని ఆయన్ను ఓ కార్యక్రమం ప్రారంభోత్సవానికి పిలవాలని చూస్తున్నారట. మరి.. అవమానానికి గురైన కేసీఆర్ వెళ్తారా? లేదా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. ప్రయత్నాలు అయితే గట్టిగా జరుగుతున్నాయి.
ఏదైనా బస్టాండ్ కు శిలాఫలకం వేస్తుంటే.. ముఖ్యమంత్రి, మంత్రి పేరు వేస్తుంటారు. అయితే.. ఇంతటి పెద్ద కార్యక్రమం చేస్తూ కేసీఆర్ పేరు లేకపోవడంపై టీఆర్ఎస్ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఇంత అవమానం జరిగాక.. తమ నాయకుడు అక్కడకు వెళ్లరని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ వెళ్తే మాత్రం వేరే లెవెల్ లో చర్చ జరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు.