- చేరికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ
- ఈసారి పాదయాత్రలో జాయినింగ్స్ ఉంటాయా?
- రాజగోపాల్ రెడ్డి పేరుతో ప్రెస్ నోట్!
- త్వరలోనే యుద్ధం సైరన్ అంటూ ప్రకటన
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన పేరుతో ఓ ప్రకటన బయటకొచ్చింది. ఇది ఆయన అధికారికంగా ఇచ్చిందా? లేదా? అనేది క్లారిటీ లేదు. కానీ.. కేసీఆర్ పై త్వరలోనే కురుక్షేత్ర యుద్ధం సైరన్ మోగిస్తున్నట్లు అందులో ఉంది. ఇటు రాజగోపాల్ పై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. పార్టీ నుంచి బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ, అలా చేస్తే పార్టీకి నష్టం చేకూరుతుందని పలువురు నాయకులు అంటున్నారు. మిశ్రమ అభిప్రాయాలతో కోమటిరెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది.
మరోవైపు బండి సంజయ్ పాదయాత్రలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఆగస్టు 2వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మూడో విడత యాత్ర సాగించనున్నారు బండి. ఈ యాత్రలో జాయినింగ్ ల పైనే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. మూడో విడత పాదయాత్ర మునుగోడు నియోజకవర్గం మీదుగా వెళ్తుండటంతో.. యాత్ర జరిగే రోజున భారీ బహిరంగ సభ నిర్వహించి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని నేతలు భావిస్తున్నారట.
పార్టీలో చేరిక తర్వాత బండి సంజయ్ తో కలిసి రాజగోపాల్ పాదయాత్ర చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. రాజగోపాల్ బీజేపీలో చేరితే.. నల్గొండ జిల్లాలో ఆ పార్టీకి మరింత కలిసివచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారని ఆశిస్తున్నారు.
మరోవైపు రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు ఆగస్టు 7వ తేదీ వరకు సమయం కావాలని రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకత్వాన్ని కోరినట్లుగా విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ కు రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు షరతు విధించడంతో ఆయన ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లుగా తెలుస్తోంది.