మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయబోతున్నారు… ఈ వార్త ఎంతో కాలంగా ప్రచారంలో ఉన్నదే. అయినా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉండగా, కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రంలోని మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులంతా సమావేశం అయ్యారు. పేరుకు మంత్రివర్గ సమావేశం కాదన్న మాటే కానీ అక్కడ జరిగింది మంత్రివర్గ సమావేశమే అన్నట్లు కనిపించింది.

దీంతో సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ లోఉండగా, కేటీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ రాష్ట్రంలో సీఎం అందుబాటులో లేని సమయంలో సీనియర్ మంత్రుల్లో ఒకరికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కేటీఆర్ లీడ్ చేశారంటే ఇన్నాళ్లు తెర వెనుక యాక్టింగ్ సీఎంగా ఉన్న ఆయన్ను ఇక తెరమీదకు తీసుకొస్తున్నారని, ఒక రకంగా ఇది ట్రైనింగ్ పిరియడ్ కావొచ్చు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం కేసీఆర్ కొత్తగా ఏ పని చేయాలనుకున్నా ప్రజల మూడ్ ను రీడ్ చేసేందుకు ఫిల్లర్స్ వదులుతుంటారు. అక్కడి నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయన తదుపరి చర్యలు ఉంటాయి. కేటీఆర్ ను సీఎంగా చేసే ముందుకు ఇలా ప్రజల మూడ్ ను, టీఆరెస్ నేతల అభిప్రాయాలను, ప్రతిపక్షాల అటెన్షన్ ను రీడ్ చేసే ఉద్దేశంతోనే ఈ వ్యూహాం ఖరారు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలోనే నెం.1 ఇండస్ట్రియల్ పాలసీ అంటూ సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన సందర్భంలోనూ ఇలా కేటీఆర్ మంత్రులతో భేటీ కానిది, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని చర్చించేందుకు అది కూడా పాలసి ఇంకా చర్చల దశలోనే ఉన్న సమయంలో భేటీ అవుతారా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే, టీఆర్ఎస్ శ్రేణుల కథనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక కారణాలతో సీఎం అందుబాటులో లేరని, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రలు ప్రత్యేకంగా లేనందున ఐటీ,ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ సమన్వయం మాత్రమే చేశారని, ఇందులో రాజకీయ కోణాలకు అవకాశం లేదని అంటున్నారు.