– యాదాద్రి ప్రారంభోత్సవానికి మోడీ వస్తారా?
– వస్తే.. కేసీఆర్ ఆహ్వానిస్తారా?
– చినజీయర్ నన్నా పిలుస్తారా? లేదా?
– సమతామూర్తి శిలాఫలకం విషయంలో హర్టయిన కేసీఆర్?
– యాదాద్రి పేరు మార్పుపైనా జోరుగా చర్చ!
అంగరంగ వైభవంగా ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. చివరి నిమిషంలో కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్కిప్ చేశారు. దీంతో తెరపైకి అనేక అనుమానాలు వచ్చాయి. ఆఖరికి టీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా సందేహాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. శిలాఫలకంలో కేసీఆర్ పేరు ఎందుకు లేదు? ఈ విషయాన్ని కేసీఆర్ దగ్గర చినజీయర్, రామేశ్వరరావు దాచారా? ఒక రోజు ముందే కేసీఆర్ కు తెలిసి హర్టయి.. కార్యక్రమానికి రాలేదా? చినజీయర్, రామేశ్వరరావుపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా? ఇలాంటి అనేక సందేహాలు తెరపైకి తీసుకొచ్చారు.
ఇప్పుడు యాదాద్రి విషయానికొద్దాం.. మార్చిలో ఆలయ పునఃప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. గతంలో ప్రధాని మోడీని కలిసి కేసీఆర్ ఆహ్వానించారు. మరి.. ఆయన ఈ కార్యక్రమానికి వస్తారా? వస్తే కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రధానిని కేసీఆర్ ఆహ్వానించలేదు. స్వయంగా ప్రెస్ మీట్ లో వెళ్తానని చెప్పి.. చివరిలో జ్వరమంటూ సైలెంట్ అయ్యారు.
ఈ విషయాలన్నింటి చుట్టూ టీఆర్ఎస్ క్యాడర్ లో గందరగోళం నెలకొందని అంటున్నారు రాజకీయ పండితులు. యాదాద్రికి మోడీ వస్తే కేసీఆర్ ఆహ్వానిస్తారా? లేదా? అంశం చుట్టూ అనేక సందేహాలను గులాబీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు యాదాద్రి పేరు మార్పుపైనా చర్చ జరుగుతున్నట్లుగా వివరిస్తున్నారు. ఎందుకంటే.. యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తానని చినజీయర్ చేత యాదాద్రిగా నామకరణం చేయించారు కేసీఆర్. మొన్నటి శిలాఫలకం విషయంలో అసహనంలో ఉన్నారు కాబట్టి.. ఆయన పెట్టిన యాదాద్రి పేరును మార్చి యాదగిరి గుట్టగానే కొనసాగిస్తారా? అనే దానిపై మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.
టీఆర్ఎస్ శ్రేణుల సందేహాలు..!
1. రామానుజ విగ్రహావిష్కరణ సమయంలో ప్రధానిని అసమతావాది, వివక్షాపూరిత నేతగా పిలిచి అవమానించారు. మరి.. యాదాద్రికి మోడీని ఆహ్వానిస్తారా? లేదా?
2. అసమతావాది మోడీని పిలవకుండా.. సమతామూర్తి కేసీఆర్ చేతులమీదుగానే కార్యక్రమం నిర్వహిస్తారా?
3. పెద్ద విగ్రహం దగ్గర అవమానించిన చినజీయర్ ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారా?
4. శిలాఫలకం మీద కేసీఆర్ పేరు లేకుండా పరువు తీసిన చినజీయర్ పెట్టిన యాదాద్రి పేరునే కొనసాగిస్తారా? లేక.. తెలంగాణ సంస్కృతిగా పిలుచుకునే యాదగిరి గుట్ట పేరు ఉపయోగిస్తారా?
5. మోడీని పిలిచినా పిలవకపోయినా.. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నేతలను ఈ కార్యక్రమానికి పిలుస్తారా? బీజేపీకి దగ్గరని వారిని దూరం పెడతారా?