– బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి!
– ఈ చేరిక లాభమా? నష్టమా?
– ఏపీ సంగతి పక్కనపెడితే..
– తెలంగాణలో కొంప ముంచే ఛాన్స్ ఉందా?
ఆయన పీలేరు నియోజక వర్గానిక ఎక్కువ.. చిత్తూరు జిల్లాకు తక్కువ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి. అంతే కాదు ఆయన తన జీవితంలో చూడలేని పదవిని అనుభవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో వదిలేసి ఇప్పుడు వేరే పార్టీ వైపు చూడడంతోనే ఆయన ఏంటనేది తెలిసిపోయిందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయన ఎవరో అర్థమై ఉంటుంది. ఆయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
ఆయన ఇప్పుడు బీజేపీలోకి వెళుతున్నారనే వార్త జోరందుకుంది. దీంతో ఈ చేరికపై రెండు తెలుగు రాష్ట్రాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాయకత్వ లక్షణాలపై సైతం రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఆయన స్వయంగా ప్రకాశించే నేత కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే నల్లారి పీలేరు నియోజక వర్గానికి ఎక్కువ.. చిత్తూరు జిల్లాకు తక్కువ అని సెటైర్లు వేస్తున్నారు.
ఆయన ప్రస్తుతం పార్టీ మారడం ఏంటో కాని.. ఆయన రాజకీయ చరిత్ర పై ఇప్పుడు చర్చ మొదలైంది. వైఎస్సార్ చనిపోయిన తరువాత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి అదృష్టవశాత్తు అనూహ్యంగా సీఎం అయ్యారు. అయితే అప్పుడు కూడా ఆయన ఎంపిక పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. పైరవీలతో సీఎం కుర్చీ దక్కించుకోవడం జరిగిందని.. ఇది ఏమాత్రం సరి కాదని అప్పుడే పార్టీలోని సీనియర్లే బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
అయితే రాష్ట్ర విభజన జరగడం.. ఆసమయంలో ఆయన ఓ పార్టీని పెట్టి.. ఘోర పరాజయాన్ని చవి చూడడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కడు కష్టాల్లోకి వెళ్లిన సమయంలో సీఎం పదవిని అనుభవించిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. అప్పట్నుంచి పార్టీకి పదేళ్ల పాటు దూరంగా ఉన్నారు.
ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో.. బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో..కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో బీజేపీకి ఒరిగేదేమున్నదనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే అదే జరిగితే..బీజేపీకి జరిగే నష్టం అంతకన్నా ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ విభజన సమయంలో నల్లారి ఏంటనే విషయం తెలుగు ప్రజలకు బాగా తెలిసిపోయిందని అంటున్నారు. అయితే ఆయన చేరికతో రెడ్డి సామాజిక వర్గం కదిలి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కానీ అంత సీన్ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఆయనకు పెద్దగా ఓటు బ్యాంకు లేదని.. ఎందుకంటే ఆయన లీడర్ కాదన్న అభిప్రాయం ఉంది. ఆయన కేవలం అధిష్టానం నిర్ణయించిన నాయకుడు మాత్రమే. అందుకే ఆయన చేరికతో బీజేపీకి రెండు రాష్ట్రాల్లోను పెద్ద లాభం చేకూరపోగా.. నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులంటున్నారు. మరోవైపు ఈ చేరికతో నల్లారికి కూడా పెద్దగా ఒరిగేదేమీ లేదని చెబుతున్నారు. ఏపిలో బీజేపీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మరో వైపు ఆయన ఒకప్పుడు సీఎంగా పనిచేసి ఇప్పుడు మళ్లీ క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగితే ఏ మేరకు వర్కౌంట్ అవుతుందనేది ప్రశ్నార్థకమే.