ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సర్కార్ వివాదం అంతా ఇంతా కాదు. పదవి పోయినా… పట్టువదలని విక్రమార్కుడిలా పదవిని తిరిగి తెచ్చుకోవటమే కాదు సర్కార్ వద్దని వారించినా… వారితోనే ఎన్నికలు నిర్వహించాడు. పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోయాయి.
మున్సిపల్ ఎన్నికలు ముగియటంతో కమిషనర్ నిమ్మగడ్డ సెలవులపై వెళ్తున్నారు. ఈనెల 16 నుండి 21 వరకు ఆయన కుటుంబంతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ టూర్ వెళ్తున్నారు. బిజీ షెడ్యూల్ తర్వాత ఆయన సెలవు పెడుతున్నట్లు ఈసీ వర్గాలు చెప్తున్నాయి.
కానీ, ఎస్ఈసీ ఈనెల 31న రిటైర్ కాబోతున్నారు. ఆయన పదవీకాలం ముగియనుంది. ఓరకంగా వైసీపీకి ఇష్టమే అయినా… టీడీపీ సహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహులు మాత్రం నిరూత్సాహపడుతున్నారు. నిమ్మగడ్డ పనిలో పనిగా తమ ఎన్నికలు కూడా పూర్తి చేస్తారనుకుంటే… చేసేలా లేడుగా ఇక అని వ్యాఖ్యానిస్తున్నారు.
గతేడాది మార్చిలో నామినేషన్లు వేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావాహులు… భారీగా ఖర్చులు చేసి, గెలుపు కోసం లాక్ డౌన్ సమయంలో పోటాపోటీ సహాయాలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు లేకపోతే… వైసీపీ అపాయింట్ చేసే వ్యక్తి కమిషనర్ అవుతారని, పైగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైతే… రిజర్వేషన్లు మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, పోతూపోతూ… ఆయన ఎన్నికలకు తేదీలు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.