మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. అఘాడీ ప్రభుత్వాన్ని బాబ్రీ మసీదు తరహా నిర్మాణంతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అఘాడీ ప్రభుత్వం బాబ్రీ తరహా నిర్మాణమని అభివర్ణించిన ఆయన దాన్ని కూల్చే వరకు తాను నిద్రపోనని ఆయన అన్నారు. ముంబైలో జరిగిన పార్టీ మహాసంకల్ప సభలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన హనుమాన్ చాలీసాను పఠించారు.
‘మేము కేవలం హనుమాన్ చాలీసా జపించాము. తన కొడుకు హయాంలో హనుమాన్ చాలీసా చదవడం దేశద్రోహమవుతుందని బాలా సాహెబ్ ఠాక్రే ఎప్పుడైనా ఊహించి ఉంటారా. ఔరంగజేబు సమాధిని సందర్శించడం రాష్ట్ర మర్యాదగా మారుతుందని ఆయన ఎప్పుడైనా భావించి ఉంటారా?’అని ఫడ్నవీస్ ప్రశ్నించారు.
‘ నిన్న జరిగిన ర్యాలీని మాస్టర్ సభ అని పిలిచారు. కానీ వాటిని వింటుంటే అది నవ్వుల సభలాగా ఉంది. నిన్నటిది కౌరవ సభ(శివసేన వాళ్లది), నేడు ఇది పాండవుల(బీజేపీ) సభ’అని ఫడ్నవిస్ అన్నారు.