పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. భవన ఓపెనింగ్ ని బాయ్ కాట్ చేయాలని తమ పార్టీతో సహా విపక్షాలు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రమోద్ ఆచార్య స్పందిస్తూ..భారత ప్రధాని కాకపోతే మరి దీన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రారంభిస్తారా అని ఎద్దేవా చేశారు. మోడీని వ్యతిరేకించే హక్కు మనకు ఉందని, కానీ దేశాన్ని వ్యతిరేకించే హక్కు లేదని ఆయన అన్నారు. విపక్షాలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నానన్నారు. పార్లమెంట్ హౌస్ ని వ్యతిరేకించడం సబబు కాదని, ఈ భవనం మొత్తం దేశానిదని ఆయన చెప్పారు.
ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. కొన్ని విషయాలను పార్టీ అపార్థం చేసుకుంటున్నదని, తమ బహిష్కరణ నిర్ణయంపై మళ్ళీ ఆలోచించుకోవాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విపక్షాలు ఈ భవనంలోకి అడుగు పెట్టవా అని ప్రశ్నించారు. పార్లమెంట్ బీజేపీకి మాత్రమే చెందినది కాదని, దేశానికంతటికీ చెందినదని ప్రమోద్ ఆచార్య పేర్కొన్నారు.
యూపీకి చెందిన ఈయన ఆధ్యాత్మిక గురువుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ వ్యవహారం రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి, ప్రధాని వహించే పాత్రలపై డిబేట్ కి దారి తీసేదిగా మారింది. కాంగ్రెస్ సహా 20 పార్టీలు దీనిపై తమ పట్టు వీడలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కొత్త భవనాన్ని ప్రారంభించాలి గానీ ప్రధాని కాదని ఇవి పేర్కొంటున్నాయి.
అయితే 25 పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చునని తెలుస్తోంది. శివసేన (షిండే వర్గం), అప్నా దళ్, అస్సాం గణ పరిషద్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, సిక్కిం క్రాంతికారి మోర్చా, తమిళ మానిల కాంగ్రెస్, బోడో పీపుల్స్ పార్టీ, పత్తాలి మక్కల్ కచ్చి, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ వంటి ఎన్డీయేలోని పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఎన్డీయేతర పార్టీలైన లోక్ జనశక్తి పార్టీ (పాశ్వాన్), బిజూజనతాదళ్, బీఎస్పీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, అకాలీదళ్, జేడీ-ఎస్ సుముఖంగా ఉన్నాయి.