– చేసిన తప్పేంటో చెప్పాలంటూ…
– అవిశ్వాసానికి సిద్దంగా లేనంటూ…
– ఠాక్రే నిస్సహాయ వ్యాఖ్యలు
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి ప్రభుత్వం అంపశయ్యపై ఉన్నది. ఓ వైపు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు దూకుడుగా ముందుకు సాగుతుంటే ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే మాత్రం ఏమి చేయలేక నిస్సత్తువగా నిలిచిపోయారు.
సీఎం ఉద్దవ్ ఠాక్రే బుధవారం ఉదయం కొంచెం దూకుడుగా ఉన్నట్టు కనిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ అత్యవసర సమావేశాన్ని సాయంత్రం ఏర్పాటు చేయనున్నట్టు దానికి అందరు ఎమ్మెల్యేలు హాజరు కావాలని విప్ జారీ చేశారు.
హాజరు కాని ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగించనున్నట్టు హెచ్చరించారు. పార్టీ పిరాయింపుల చట్టాన్ని ప్రయోగించి సదరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించనున్నట్టు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు సూరత్ నుంచి అసోంకి బుధవారం ఉదయం చేరుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు దూకుడు పెంచారు. తాము ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కౌంటర్ ఇచ్చారు.
అన్నట్టుగానే ఏక్ నాథ్ షిండేను తమ నాయకుడిగా ఎన్నుకున్నామని, ఇకపై ఆయన నాయకత్వంలో పనిచేయనున్నట్టు తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా తమదే అసలైన శివసేన పార్టీ అంటూ ఎన్నికల సంఘానికి, గవర్నర్ కు లేఖలు పంపారు.
మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉండటంతో వారిపై పార్టీ పిరాయింపుల చట్టం కింద వేటు వేయడం కష్టతరంగా మారనుంది. మరోవైపు మరి కొందరు నేతలు కూడా షిండే వర్గంలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బెట్టు చేస్తే పదవి మాట దేవుడెరుగు, పార్టీ చీలిపోయి తన రాజకీయ భవిష్యత్ కే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టు ఠాక్రే భావించారని రాజకీయ పండితులు చెబుతున్నారు. దీంతో ఆయన నిస్సహాయులుగా మిగిలిపోయారని విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. అవిశ్వాసానికి ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. సొంత పార్టీ నేతలే తనను మోసం చేయడం బాధించిందన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవి నుంచి, శివసేన పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు తెలిపారు.
రాజీనామా చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టు తెలిపారు ఏక్ నాథ్ షిండేను, తిరుగుబాటు నేతలను చర్చలకు ఆహ్వానించినట్టు తెలిపారు. శివసేన సైనికులు ఎవరైనా సీఎం కావడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో ఉద్దవ్ ఠాక్రే పదవి నుంచి దిగిపోవడం ఖాయమని తెలుస్తోంది.
ప్రస్తుతం షిండే నిర్ణయం కీలకంగా మారింది. ఠాక్రే ఆహ్వానాన్ని మన్నించి చర్చలకు హాజరై సీఎం పదవి చేపట్టి శివసేనలోనే కొనసాగుతారా లేదా బీజేపీకి మద్దతు ఇచ్చి అందరి ఊహాగానాలను నిజం చేస్తారా అన్నది చూడాలి…