పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోతారా ? కోర్టు ఈ మేరకు ఉత్తర్వులివ్వగానే అంతా షాక్ కి గురయ్యారు. కోర్టు ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసి.. రెండేళ్ల శిక్ష విషయంలో దాన్ని సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేసుకునేందుకు 30 రోజుల వ్యవధి నిచ్చింది. ఏమైనా రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని నిలుపుకోగలుగుతారా అన్నది చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 2013 లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన రూలింగ్ ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఓ పార్లమెంట్ సభ్యుడిని గానీ, శాసన సభ లేదా శాసన మండలి సభ్యుడిని గానీ ఓ కేసులో కోర్టు దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సందర్భంలో ఆ వ్యక్తి తక్షణమే తన సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే ఈ అత్యున్నత న్యాయస్థానమే తన ఇదివరకటి తీర్పునకు భిన్నంగా రూలింగ్ ఇచ్చింది. ఏ సభ్యుడైనా తనకున్న ప్రత్యామ్నాయ న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు అతని సభ్యత్వానికి ఢోకా ఉండదని పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 8 (4) ని కోర్టు ప్రస్తావించింది. ఈ సెక్షన్ కింద ఎన్నికైన ప్రజాప్రతినిధి అప్పీలు చేసుకోవడానికి మూడు నెలల వ్యవధి ఉంటుంది. తన శిక్షను సూరత్ కోర్టు ప్రకటిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ కోర్టులోనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో సాంకేతికంగా చూస్తే 1951 నాటి ఈ చట్టంలో సెక్షన్ 8 (3) కూడా ఉంది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పట్ల ఏ సభ్యుడైనా అసంతృప్తి ప్రకటించినప్పుడు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కేసులో ఆయన హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. పై కోర్టు కింది కోర్టు ఇచ్చిన రూలింగ్ కి భిన్నంగా ఉత్తర్వులు ఇస్తే రాహుల్ లోక్ సభ సభ్యత్వానికి ముప్పు ఉండబోదు. పైగా ఆయనకు సూరత్ కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది గనుక ఆయన ఈ సమయంలో పైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు.
రాహుల్ పై అనర్హత కత్తి వేలాడుతోందని, ఆయనపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అనర్హత వేటు వేసిన పక్షంలో ఆయన సభ్యత్వానికి ముప్పు తప్పదనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాహుల్ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడుతుందని, వచ్చే 8 ఏళ్ళ పాటు ఆయన ఏ ఎన్నికల్లోనూ పాల్గొనే అవకాశం లేదని భావిస్తున్నారు.