తమిళ చిత్రపరిశ్రమలో రజనీకాంత్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వచ్చిందంటే చాలు.. కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని అంతా ధీమా వ్యక్తం చేసేవారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. ఇటీవల ఆయన చేస్తోన్న సినిమాలు నిరాశనే మిగులుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడంతో బయ్యర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో రజనీకాంత్ నటించనుండటం, అలాగే తమిళ టాప్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించడంతో ఈ చిత్రం బాగానే ఆడుతుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం ప్లాప్ లిస్టులోకి వెళ్ళింది. ఈ సినిమా భారీ నష్టాలను మూటగట్టుకోవడంతో నష్టపోయిన బయ్యర్లు రజనీకాంత్ ను కలిశారు. తమ నష్టాలకు మీరే మార్గం చూపించాలని.. లేదంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని రజనీకి చెప్పాలనుకున్నా అక్కడ నుంచి ఆశాజనకమైన హామీ రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన దర్బార్.. కనీసం 100 కోట్లు షేర్ కూడా తీసుకురాలేదు. తమిళనాటలో 64కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు 37కోట్లు మాత్రమే వచ్చాయట. దీంతో దర్బార్ తమను కోలుకోలేని దెబ్బతీసిందని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు సినిమా నష్టాలకు తనను బాద్యుడిని చేస్తూ బయ్యర్లు బెదిరిస్తున్నారని.. దర్శకుడు మురుగదాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు బయ్యర్ల నుంచి హానీ ఉందని తెలిపాడు. రజనీకాంత్ సినిమాతో కలిసి వస్తుందని అనుకుంటే ఇలా అయ్యిందేంటని బయ్యర్లు.. రజనీకాంత్, మురుగదాస్ పై అసంతృప్తితో ఉన్నారు. అయితే వివాదంపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. దర్బార్ సినిమా ప్లాప్ అయితే ఈ చిత్రం విడుదలైన తరువాత ఎందుకు నవ్వుతు ఫోటోలు దిగారని బయ్యర్లను ప్రశ్నిస్తున్నారు. రజనీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.