వర్షాకాలం వచ్చిందంటే చాలు రకరకాల వ్యాధులు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రధానంగా డెంగ్యూ అలాగే టైఫాయిడ్ జ్వరంతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. ఆసుపత్రులు అందుబాటులో ఉన్న చోట ఎటువంటి ఇబ్బందులు లేవు గాని కొన్ని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మందులు కూడా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాలపై ఈ విషయంలో విమర్శలు కూడా మనం వింటూనే ఉంటాం.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా డెంగ్యూ జరం కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంటువ్యాధి ని కట్టడి చేసేందుకు భారతీయ శాస్త్రవేత్తలు పని మొదలుపెట్టారు. దీనికి సంబంధించి అనేక పరిశోధనలు చేస్తూ ఒక డిఎన్ఎ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ తయారు చేసిన జైడస్ కాడిలా అనే కంపెనీ కరోనా వ్యాక్సిన్ ఫార్ముల తోనే డెంగ్యూ వ్యాక్సిన్ కూడా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ కి సంబంధించి ఒక సీనియర్ శాస్త్రవేత్త మీడియాతో మాట్లాడుతూ వైరస్ కు సంబంధించి నాలుగు సెరోటైప్ లు ఉన్నాయని తాము గుర్తించామని కానీ వీటిలో జన్యు వైవిధ్యం లో చాలానే ఉన్నాయని తాము కనుగొన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి తమ బృందం ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.