చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఈరోజు ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తన సమస్యల్ని, కోరికల్ని ముఖ్యమంత్రితో చెప్పుకున్నారు. సీఎం జగన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించారు. మరి జగన్, ఇండస్ట్రీ సభ్యుల్ని ఏం కోరారు? తనకు ఏం కావాలో ఇండస్ట్రీ పెద్దలకు క్లియర్ గా చెప్పారు జగన్.
ఇకపై సినిమాల షూటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగాలని కోరారు ముఖ్యమంత్రి. తెలంగాణతో పోలిస్తే ఏపీ నుంచే టాలీవుడ్ కు ఎక్కువ రెవెన్యూ వస్తున్నప్పుడు, రాష్ట్రంలో ఎందుకు షూటింగ్ చేయరని ప్రశ్నించారు. దీనిపై మహేష్ బాబు స్పందించాడు. ఆంధ్రాలో కూడా షూటింగ్ చేస్తున్నామని చెప్పాడు. అది అన్ని సినిమాలకు వర్తించాలని జగన్ అన్నారు. ఇకపై ప్రతి తెలుగు సినిమా షూటింగ్, కనీసం 20శాతం ఆంధ్రప్రదేశ్ లో జరిగేలా నిబంధన తీసుకొస్తామన్నారు జగన్.
ఇక జగన్ నుంచి మరో విజ్ఞప్తి కూడా వచ్చింది. టాలీవుడ్ ను విశాఖపట్నం తీసుకురావాలని కోరారు ముఖ్యమంత్రి. వైజాగ్ వచ్చే సినీ ప్రముఖులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాను విశాఖలో తయారుచేద్దామన్నారు. అంతేకాదు.. ఎవరైనా స్టుడియోస్ కట్టాలనుకుంటే విశాఖలో స్థలాలిస్తామన్నారు సీఎం. ఇలా జగన్ నుంచి కూడా టాలీవుడ్ కు కొన్ని విజ్ఞప్తులు అందాయి.
జగన్ ఆలోచన విధానానికి రాజమౌళి, మహేష్ లాంటి వాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. టాలీవుడ్ ను, సినీ వ్యాపారాన్ని, సినీ కష్టాల్ని ముఖ్యమంత్రి అర్థం చేసుకున్న విధానం చాలా బాగుందని.. ఆయన విశ్లేషణ చేస్తుంటే తమకు చాలా ముచ్చటేసిందని చెప్పుకొచ్చారు.