ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఏపీలో వైఎస్ తో జతకట్టారు. గత ఎన్నికల్లో జగన్ కష్టానికి పీకే వ్యూహాలు, ప్రచారం తోడయ్యాయి. అందుకే ఎవరూ ఊహించనంతగా ఏకంగా 151అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత వైసీపీకి దూరంగా ఉన్న పీకే… హాఠాత్తుగా శుక్రవారం జగన్ తో భేటీ అయ్యారు.
ఉదయం జగన్ తో భేటీ అయిన పీకే… సాయంత్రానికి మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ లో కలిసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఎందుకు కలిశారు, ఉదయం జగన్ తో సాయంత్రం కేటీఆర్ తో భేటీ వెనుక రహస్యం ఏమై ఉంటుందన్న ఊహాగానాలు పెరిగిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హింట్ ఇచ్చిన జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయన్న భావనలో తెలుగు రాష్ట్రాల సీఎంలున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2022లోనే జమిలీ తప్పదని, ఇతర పార్టీలు మేలుకోక ముందే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని… అందుకే ఇప్పటి నుండే చిన్న, చితక ఎన్నికలు అని కూడా చూడకుండా బీజేపీ దూకుడుగా ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎన్నికల వ్యూహాకర్తలను ఇప్పటి నుండే బరిలోకి దింపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఏపీలో జగన్ మరోసారి పీకేను నమ్ముకోగా… టీఆర్ఎస్ లో కేటీఆర్, సంతోష్, కవితలు కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ, కేసీఆర్ మాత్రం పీకే నియామకాన్ని హోల్డ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే టీఆర్ఎస్ కూడా ఓ నిర్ణయానికి వచ్చేయనుంది. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకోవటం, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న కార్యక్రమాలపై వెనక్కి తగ్గటం, పెండింగ్ హామీలపై త్వరలో నిర్ణయం అంటూ ప్రకటనలు చేస్తుండటంతో టీఆర్ఎస్ కూడా ముందస్తుకు ముందుగానే రెడీ అవుతుండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.