2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించారని, అలాగే గాడ్సేపై రూపొందించిన సినిమాను కూడా బ్యాన్ చేస్తారా అని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీని ప్రశ్నించారు. 2002 లో మీరు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఘర్షణలపై బీబీసీ డాక్యుమెంటరీని తీసిందని, అయితే ఇండియాలో ట్విట్టర్, యూ ట్యూబ్ లలో దీన్ని మీరు బ్యాన్ చేశారని ఆయన అన్నారు. ఆ నాటి అల్లర్లలో ఎవరైనా అంతరిక్షం నుంచో, ఆకాశం నుంచో వచ్చి ప్రజలను చంపారా అని ప్రశ్నించారు.
మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై మీ అభిప్రాయమేమిటో తెలుసుకోగోరుతున్నా.. అతని జీవిత చరిత్రపై వస్తున్న చిత్రం మీద మీ బీజేపీ నేతల అభిప్రాయాలేమిటో తెలుసుకోగోరుతున్నా అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఒవైసీ.. ‘ప్రజాస్వామ్య భూమిలో జీ-20’ అనే క్యాప్షన్ తో ఢిల్లీలో పోస్టర్ల ని తాను చూశానని, కానీయూ ట్యూబ్ లో బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం ఉందని చెప్పారు.
ఈ నెల 30 న మహాత్మా గాంధీ వర్ధంతి అని, ఆ రోజుకు ముందే గాడ్సేపై చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నామని ఒవైసీ అన్నారు. మోడీపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని ఇతర విపక్షాలు కూడా తప్పు పట్టాయి.
భారత దేశ పార్లమెంటులో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారని, కానీ ముస్లిములు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ నాయకునికింద ఎదగడం రాజకీయ పార్టీలకు నచ్చదని ఒవైసీ పేర్కొన్నారు. ఇండియాలో ముస్లిములు పొలిటికల్ పార్టీలకు బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని, 70ఏళ్లుగా మమ్మల్ని ఇలాగే దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇక తల్వార్లు, కత్తులతో దాడులు చేస్తున్నవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని ఆయన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ని కోరారు.