ములుగు జిల్లా, వెంకటా పూర్, పాలంపేట గ్రామంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన రామప్ప దేవాలయాన్ని బుధవారం దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని పాలం పేట గ్రామ ప్రథమ పౌరురాలు గ్రామ సర్పంచ్ అయిన డోలి రజిత ఆరోపించారు.
అధికారులు ,ప్రజాప్రతినిధులు తనను అవమానించారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రామప్ప ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన ఎంతో మంది నుంచి భూములు కేటాయించడానికి సహకరించానని.. చిల్లర దుకాణాల యజమానులను ఒప్పించానని ఆమె అన్నారు. ఇక రాష్ట్రపతి రాక సందర్బంగా.. రేయింబవళ్లు దగ్గరుండి ఏర్పాట్ల విషయంలో కష్ట పడ్డానని అన్నారు. అయినా కాని జిల్లా యంత్రాంగం తన కష్టాన్ని గుర్తించలేదని ఆవేదన చెందారు.
అధికారులు కావాలనే తన పేరు లేకుండా చేసి అవమానించారని ఆమె ఆరోపించారు. తనను రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఆహ్వానించలేదని, సన్మానించేందుకు అనుమతించలేదని, పేరు కూడా శిలాఫలకం మీద లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగానికి కల్పించిన వీఐపీ గ్యాలరీలో కూర్చునే అవకాశం కూడా కల్పించలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని సర్పంచ్ డోలి రజిత డిమాండ్ చేశారు.
ఇక ఈ విషయం పై పురావస్తుశాఖ అధికారితో ఫోన్ లో మాట్లాడగా.. రాష్ట్ర పతి పర్యటనకు సంబంధించిన పూర్తి బాధ్యతలు కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరిగాయని బదులిచ్చారు. ఈ ఫోన్ సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది.