తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోత కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న నాలుగు ఐదు రోజులు వర్షాలు కురిసే వాతావరణ అధికారులు చెప్పారు.
ఇక తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటు నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ద్రోణి దృష్ట్యా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అలాగే, పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇక ఉపరితల ద్రోణి ఆదివారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి.. విదర్భ, మరాట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని చెప్పారు. ఈ మేరకు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎండ తీవ్రత పెరగటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కురుస్తోన్న వర్షాలతో వాతావరణ పరిస్థితులు చల్లబడ్డాయి. ఇన్నిరోజులు ఎండలు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది.