రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలకు రంగం సిద్ధం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించుకునేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ముందు జాగ్రత్తగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని శోభాయాత్రలో ఎలాంటి ఆవాంతరాలు లేకుండా నిర్వహించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు.
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పోలీసులు మార్గదర్శకాలు పాటించాలని ఉన్నతాధికారులు సూచించారు. కాగా.. ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శ్రీరామనవమి శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు హైకోర్టు స్పష్టం చేసింది.