రాష్ట్రంలో మద్యం దుకాణాలను మళ్లీ ప్రైవేట్ వ్యాపారులకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వామే నడిపిస్తున్న మద్యం దుకాణాలకు స్వస్తి పలకాలని భావిస్తోంది. మూడురోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు,అమలు సాధ్యాసాధ్యాలపై ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
విధాన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండే ఓ ఉన్నతాధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరింత ఆదాయం రాబట్టుకోవడం కోసం ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.25 వేల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మింది. తద్వారా దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
దీంతో ప్రభుత్వం సంతృప్తి చెందట్లేదని సమాచారం. వాస్తవంగా మద్యం వ్యాపార పరిమాణం ఇంకా చాలా ఎక్కువగా ఉందని దాన్ని సరిగ్గా రాబట్టలేకపోతున్నామని ఎక్సైజ్ వర్గాల్లో ఉంది. ప్రైవేటు వ్యాపారులకు దుకాణాల నిర్వహణను అప్పగిస్తే వారు కమీషన్ సొమ్ము కోసం వివిధ మార్గాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.
ప్రైవేటు వ్యాపారులు పూర్తిగా వృత్తి నైపుణ్యంతో వ్యాపారం చేస్తారని, బీర్ల చల్లదనం కోసం కూలర్లు, వినియోగదారులకు అవసరమైన ఇతర వసతులు,పర్మిట్ రూమ్ లు వంటివి ఏర్పాటు చేసుకోగలరని… వీటి వల్ల విక్రయాలు బాగా పెరుగుతాయని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలకు రూ.1,900 కోట్ల విలువైన మద్యం అమ్ముతున్నారు. ప్రైవేటు వ్యవస్థకు ఇస్తే కనీసం నెలకు వచ్చి రూ.3 వేల కోట్లు అమ్ముతారని దాని వల్ల ఆదాయం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.
ఏపీలో మద్యం విక్రయాలు పెరగకపోవడానికి కారణాలు:
అన్నిబ్రాండ్లు అందుబాటులో లేకపోవడం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు ఎక్కువగా ఉండటం. నాటుసారా తయారీ-వినియోగం విపరీతంగా పెరగటం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా,గోవా తదితర రాష్ట్రాల నుంచి ట్యాక్స్ చెల్లించని మద్యం రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున అక్రమంగా వస్తుండటం, అంతేకాకుండా ఖరీదైన, ఓ మాదిరి బ్రాండ్లను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం వంటి వాటి వల్ల కూడా మద్యం విక్రయాలు తగ్గుతున్నాయి.