మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అక్రమార్కుల వద్ద అందినకాడికి తీసుకొని అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
జిల్లాలోని దేవరకద్ర మండల పరిధిలోని గోప్లపూర్, బండర్ పల్లి శివారులో గల వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ.. అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారని నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అక్రమార్కులు ఇస్తున్న ముడుపులకు ఆశపడి.. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారని విమర్శించారు.
ప్రతీ రోజు రాత్రి 10 ట్రాకర్లతో ఇసుక రవాణ జరుగుతోందని అన్నారు. కానీ.. అధికారులెవరు అటు వైపుకూడా తొంగిచూడటంలేదని విమర్శించారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు ప్రవీణ్. రాత్రివేళల్లో మూడుపువ్వులు ఆరుకాయల్లా ఇసుక మాఫియా సాగుతోందని వ్యాఖ్యానించారు. అధికారుల అండదండలతో అక్రమార్కులు యదేశ్చగా ఇసుక తరలింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నేనుసైతం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అనేక సార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. తూ.. తూ.. మంత్రంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణకు అడ్డుకట్టలు వేయాలని.. ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తుమన్నారు ప్రవీణ్ కుమార్.