హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో-2022.. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో.. మొదటిరోజు బీ2బీ మీటింగ్స్ ను నిర్వహించారు. అందులో భాగంగా ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత విమానయాన రంగంతో తమ భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు.
కరోనా వల్ల గడిచిన రెండేళ్లు పౌర విమానయాన రంగం కఠినమైన సవాళ్లు ఎదుర్కొందని విమానయాన రంగ నిపుణులు తెలిపారు. భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని .. రాబోయే ఇరవై ఏళ్లలో 2210 విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్ బస్ ప్రకటించింది. ఇంధన, ప్రాపంచిక ఒత్తిడి పరిస్థితులతో ఏవియేషన్ మార్కెట్ మరింత ప్రభావితమవుతోందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడ్డారు.
ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా బెంగళూరులో తమ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోలో భాగంగా ఎయిర్ బస్ 350 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందర్శకుల కోసం సారంగ్ టీమ్ చేసిన విన్యాసాలు అలరించాయి.
మరోవైపు.. వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో-2022 ప్రదర్శనను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించనున్నారు. విమానయానరంగ భవిష్యత్తుపై 2 రోజులు రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా మొదటి రెండు రోజులు పాలసీ తీర్మానాలపై చర్చలు జరగనున్నాయి.