దేశంలోకి ఇప్పుడిప్పుడే శీతాకాలం ఎంటర్ అవుతోంది.అయితే దేవ భూమి ఉత్తరాఖండ్ లో మాత్రం మంచు కారణంగా కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. శీతాకాలం ప్రారంభంలోనే విపరీతంగా మంచు కురుస్తోంది.
ఎత్తైన పర్వతాలు, హిమాలయ పర్వత ప్రాంతం ధర్మాలోయలోని లోతట్టు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురవడంతో ఆ ప్రాంతాలు తెల్లటి వస్త్రం పరుచుకున్న విధంగా కనిపిస్తూ అందరినీ కనువిందు చేస్తున్నాయి.
ధర్మాలోయలోని ప్రాంతాల్లో ఒక అడుగు మేర మంచు పేరుకుపోయింది. చలికాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించడంతో ఆ ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి.17,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయింది.
చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న చివరి చెక్ పోస్ట్ అయిన ధర్మాలోయలోని 14 గ్రామాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు మంచు..మరోవైపు చలి తీవ్రత పెరుగుతున్నా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మొక్కవోని ధైర్యంతో భద్రతా బలగాలు సరిహద్దు వెంబడి చెక్ పోస్టుల వద్ద పహారా కాస్తున్నాయి.