ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా పలు కంపెనీలు సిబ్బంది సంఖ్య తగ్గించుకుంటోంది. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల టేక్ హోం శాలరీలు తగ్గిస్తున్నాయి. తాజాగా విప్రో కంపెనీ ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది.
మొదట ఆఫర్ చేసిన దానిలో సగం జీతానికే పని చేయాలంటూ ఫ్రెషర్స్ ను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, క్లైయింట్స్ నుంచి డీల్స్ విషయంలో తీవ్రం జాప్యం జరుగుతోందంటూ సంస్థకు ఎదురవుతున్న ఇబ్బందులను పేర్కొంటు మెయిల్ చేసింది.
అందువల్ల సగం జీతంతో ప్రాజెక్టులకు అంగీకరించాలని కోరింది. 2022-23 వెలాసిటీ గ్రాడ్యుయేషన్ కేటగిరీలో భాగంగా శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు కంపెనీ ఏడాదికి రూ.6.5 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. వారి శిక్షణ పూర్తి కావడంతో వారిని వచ్చే నెల నుంచి రోల్స్ లోకి తీసుకోనున్నారు.
ఈ క్రమంలో శాలరీ ప్యాకేజీని మాత్రం రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని విధుల్లో చేరాలంటూ ఫ్రెషర్లను కోరింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాటు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్‌లో విప్రో పేర్కొంది.
ఈ కొత్త ఆఫర్‌కు ఓకే చెప్పి విధుల్లో చేరాలని వారిని కోరుతోంది. కొత్త ఆఫర్ ఒకే అంటే పాత ఆఫర్ రద్దవుతుందని వెల్లడించింది. అంతకు ముందు శిక్షణ సమయంలోనే సరైన పనితీరు కనబరచడం లేదంటూ 425 మందిని విప్రో ఇంటికి పంపింది.